హర హర మహాదేవ-సి.హెచ్.ప్రతాప్
 శివ అంటే సంస్కృతంలో స్వచ్చమైనది మరియు పవిత్రం అని అర్థం,పవిత్రతకే పవిత్రమైనవాడు అని శివుడుని వేదాలు కీర్తించాయి. శివుని పేరు ఉచ్చరించినా చాలు మీ మనస్సును శాంతపరుస్తుంది. పరమశివుని దేవతలకే దేవుడు మహాదేవుడుగా కూడా అభివర్ణిస్తారు. అంటే ఆయన సూర్యుడు, భూమి, నీరు మరియు గాలిని మించిన దేవుడని అర్థం.చంద్రుడిని చంద్రశేఖర లేదా చంద్రమౌళి అంటే చంద్రుడినే కిరీటంలాగా ధరించేవాడని కూడా అంటారు. చంద్రుడిని కిరీటంలా పెట్టుకోవడం అంటే శివుడు తన మనస్సుపై పూర్తి నియంత్రణ కలవాడని అర్థం.
ప్రతి నెలా శివరాత్రి వచ్చినా, మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి నాడు వచ్చే శివరాత్రికి చాలా విశిష్టత ఉంది. ఈ శివరాత్రిని మహా శివరాత్రి అంటారు. మహా శివరాత్రి అనేది శివునికి అంకితం చేయబడిన ఉపవాసం. ఈ రోజున ఒక్కసారి మనస్పూర్తిగా శివా అని పిలిచినా చాలు శివుడు మనల్ని అన్ని రకాలుగా రక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.మహా శివరాత్రి రోజున నెయ్యి కొని, శివలింగానికి అభిషేకం చేసి, ఆ నెయ్యిని దానం చేస్తే ధన సమస్యలు, ఇంట్లో ధన కొరత తొలగిపోతాయి. శివుని అనుగ్రహంతో ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి సంపద పెరుగుతుంది.మహా శివరాత్రి రోజున పాలు కొని శివలింగానికి నైవేద్యంగా పెట్టి అభిషేకం చేస్తే సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి. అంతే కాకుండా పేదలకు పాల ఉత్పత్తులను దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.మహా శివరాత్రి నాడు పేదలకు బట్టలు దానం చేస్తే జీవితంలో ధన సమస్యలు తీరుతాయి. దీంతో ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఋణం తొలగుతుందని, శివుని పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
శివుడు బూడిద పూసుకుంటాడు. మనిషి చివరకు బూడిదే అవుతాడు. ఈ శరీరం చివరకు బూడిదే, దాని మీద వ్యామోహం వద్దు అని అన్నట్టు. పాములు మెడలో వేసుకుంటాడు. ఆ పాములు మనిషిని వెంటాడే అరిషడ్వర్గాలు. వాటిని అదుపులో పెట్టుకోవాలని చెప్పడమే అన్నట్టు. ఇక శివుడికి మూడవ కన్ను ఉంటుంది అది తెరిస్తే అంతా ప్రళయమే అంటారు. మనిషికి కూడా మూడవ కన్ను ఉంటుంది అదే జ్ఞాన నేత్రం.
వేదాలు శివుడిని మొత్తం విశ్వానికి తండ్రిగా కీర్తించింది. ఆయన దేవతలందరిలో పరమాత్మ. అందుకే ఆయనను దేవతల దేవుడైన మహాదేవ అని, శివుడిని ఆరాధించడం వల్ల శ్రేయస్సు, సంపద, ఆరోగ్యం ఉండడంతోపాటు మనస్సు ప్రశాంతంగా ఉంటుందని అశేష భక్త జనుల నమ్మకం.
శివ పంచాక్షరీ మంత్రాన్ని  క్రమం తప్పకుండా జపించడం వల్ల మన జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మన  పాపాలన్నీ తొలగిపోతాయి,  మనస్సును ప్రశాంతపరుస్తుంది. మన  ఆత్మను అన్ని రకాల ప్రతికూల ఆలోచనల నుండి విముక్తి చేస్తుంది. మనస్సు కూడా ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి పొందుతుంది. కామం, అహం మరియు కోపం వంటివి దరిచేరవు. 
కామెంట్‌లు