సూర్య గ్రహణం ;- సేకరణ:డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై .
 భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత
భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం
వలన సూర్య గ్రహణము ఏర్పడుతుంది.  ఈ ప్రకియను ప్రాచీన హిందూ
మతంకు సంబంధించిన సూర్య సిద్ధాంతంలో కూడా చెప్పబడింది. సూర్య
గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. ప్రాచీన కాలంలో
గ్రహణాలను అశుభ సూచకముగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో
కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు.
అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై చీకటి కమ్ముకోవడం
వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు. విజ్ఞాన శాస్త్రం
గ్రహణాలను వివరించిన తరువాత ప్రజల్లో ఇటువంటి నమ్మకాలు
తగ్గాయి.
భూమిని చంద్రుడి పూర్ణ ఛాయ (అంబ్రా) కప్పినపుడు మాత్రమే సంపూర్ణ
సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అందుచేత సంపూర్ణ సూర్య గ్రహణాలు,
భూమ్మీద ఎక్కడైనా సరే, చాలా అరుదు. సంపూర్ణ సూర్య గ్రహణం
చూడదలచినవారు ఆ గ్రహణం పట్టే ప్రదేశాలు సుదూరంలో ఉన్నప్పటికీ
అక్కడకు వెళ్ళి ఆ గ్రహణాన్ని చూస్తారు. 1999లో ఐరోపాలో కనిపించిన
సూర్యగ్రహణమును ప్రపంచంలో అత్యధిక ప్రజలు వీక్షించారని చెబుతారు.
దీనివలన గ్రహణాల పట్ల ప్రజలకు అవగాహన పెరిగింది. తరువాతి
గ్రహణాలు 2005, 2006 లలోను, 2007 సెప్టెంబర్ 11 న వచ్చాయి.
తరువాతి సంపూర్ణ సూర్యగ్రహణము 2008 ఆగష్టు 1 న వచ్చింది.
సూర్య గ్రహణాలు నాలుగు రకాలు.
 సంపూర్ణ సూర్య గ్రహణం: చంద్రుడు
సూర్యుడిని పూర్తిగా కప్పివేయడం వల్ల ఇది
జరుగుతుంది. అత్యంత ప్రకాశ వంతమైన గోళం వలే
కనిపించే సూర్యుడు చంద్రుడి ఛాయ వల్ల ఒక
సన్నటి అంచు వలే కనిపిస్తాడు. ఏదైన సమయంలో
సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక
ప్రదేశములో వారికి మాత్రమే కనిపిస్తుంది.
 అంగుళీయక (యాన్యులర్) సూర్య గ్రహణం:
సూర్యుడు చంద్రుడూ ఒకే కక్ష్య లోకి
వస్తారు. కాని సూర్యుని కంటే చంద్రుని
పరిమాణము చిన్నదిగా ఉండడం వలన, చంద్రుని
చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఒక ఉంగరం
వలే కనిపిస్తాడు.
 సంకర గ్రహణం: ఇది సంపూర్ణ, అంగుళీయక సూర్య
గ్రహణాలకు మధ్యస్తంగా ఉంటుంది. ఈ సంకర
గ్రహణము భూమిపై కొన్ని ప్రదేశాలలో
సంపూర్ణ గ్రహణంగా, మరి కొన్ని ప్రదేశాలలో
పాక్షికంగాను కనిపిస్తుంది. సంకర గ్రహాణాలు
అరుదు.
 పాక్షిక సూర్య గ్రహణం:
సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో
ఉండరు. చంద్రుడు సూర్యుడిని
పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడు
ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య
గ్రహణం అని అంటారు. పాక్షిక గ్రహణం
భూమి మీద చాలా భాగాలనుండి
కనిపిస్తుంది
సూర్య గ్రహణం నాటి సూర్య, చంద్ర, భూ స్థితులు ఎలా
ఉంటాయో ప్రక్కన ఉన్న బొమ్మలో చూడవచ్చు. ముదురు
బూడిద రంగుతో ఉన్న భాగాన్ని పూర్ణ ఛాయ (అంబ్రా) అని
పిలుస్తారు. లేత బూడిద రంగులో ఉన్న భాగాన్ని ఉప
ఛాయ (పెనంబ్రా) అని పిలుస్తారు. ముదురు బూడిద రంగు
భాగంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. లేత
బూడిద రంగు ప్రాంతంలో పాక్షిక సూర్యగ్రహణము
కనిపిస్తుంది. భూని చుట్టూ ఉండే చంద్రుని కక్ష్య, సూర్యుడి
చుట్టూ తిరిగే భూమి కక్ష్యా తలానికి 5 డిగ్రీల కంటే కొద్దిగా
ఎక్కువ కోణంలో వంగి ఉంటుంది. దీని వలన అమావాస్య
నాడు చంద్రుడు సూర్యుడికి పైనో క్రిందో ఉంటాడు.
అమావాస్య నాడు, చంద్రుడు చంద్ర కక్ష్య, భూకక్ష్య
ఖండించుకునే బిందువులకు దగ్గరగా ఉన్నపుడు మాత్రమే
సూర్య గ్రహణము ఏర్పడుతుంది.

కామెంట్‌లు