సుప్రభాత కవిత ; - బృంద
రేవును వదిలిన నావను
తీరం బేలగా చూసినా
కదిలే కొద్దీ పెరిగే దూరం
వదిలే కొద్దీ బిగిసే బంధం

మాసిపోని మమతల
మరపురాని క్షణాలు
మరలిరాని మజిలీ చేరిన
తరలిపోయిన బంధాలు

సాగే నీటిలో ప్రతి బిందువూ
కదిలే  కాలపు ప్రతి క్షణమూ
ఎంత ఎదురుచూచినా
మళ్లీ  తిరిగి రాదు

చేతిలో మిగిలిన క్షణాలు
కరిగిపోకముందే
మనసులో మరిగే ప్రశ్నలకు 
జవాబులు వెదకాలి

కలలన్నీ పండకపోయినా
కలతల్ని మరిపించుకుని
కనుల నిండ సంతోషంతో
కళకళలాడుతూ  ఉండాలి

ఆత్మీయత పంచాలి
అభిమానం పెంచాలి
అనురాగం నిలపాలి
అపేక్షలు గెలవాలి

అందరినీ కలుపుకుని
ఆత్మీయంగా కలుసుకుని
ఆప్యాయతలు పంచుకుని
ఆదరంగా చూసుకుంటూ

మనమందరికీ చిన్న
జ్ఞాపకంగా నిలవాలి
మన కంటూ మనసులు 
కొన్ని సొంతమవాలి

🌸 సుప్రభాతం 🌸

కామెంట్‌లు