సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం.
 న్యాయాలు -432
కంటక న్యాయము
    ****
కంటకము అంటే ముల్లు.
ఛలం ఛలేనా వంచయేత్.
కంటక న్యాయము అంటే 'ముల్లును ముల్లుతోనే తీయాలి' లేదా ' ముల్లు తీయడానికి ముల్లే కావాలి' అని అర్థము.
" ముల్లును ముల్లుతోనే తీయాలి 'వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి" అనే సామెతగా తెలుగులో చెబుతుంటారు.
 వజ్రాన్ని వజ్రంతో కోయడం అంటే తప్పదు.నిజంగా ముల్లును ముల్లుతోనే తీయాలా? ఏం వేరే దేనితోనైనా తీస్తే రాదా! ఆశ్చర్యకరమైన ప్రశ్న చటుక్కున మనలో ఉదయిస్తుంది.
 "వజ్రాన్ని కోయాలంటే వజ్రమంత గట్టిదైన వస్తువు కావాలి. కానీ వజ్రమంత గట్టి వస్తువు వేరే లేదు కాబట్టి.వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి"అనే నానుడి వచ్చింది.
ఇక ముల్లు విషయానికి వస్తే ముల్లు చివర్లో సూది కన్న చాలా సన్నగా వుంటుంది.కాబట్టి ముల్లుతో ముల్లు విరిగిన ప్రదేశాన్ని అటూ ఇటూ పెల్లగించినట్లు వత్తిడి చేసి కదిలిస్తే చర్మంలో విరిగిన ముల్లు ఆ వత్తిడితో పైకి వస్తుంది.అలా చర్మానికి ఎక్కువగా నొప్పి కలుగకుండా ముల్లుతో చేయ వచ్చు.అదే సూది లాంటిది అయితే నొప్పి బాగా లేస్తుంది.
ఇదంతా సామాన్యంగా అందరికీ తెలిసిందే.కానీ మన పెద్దలు ఈ న్యాయమును మానవ జీవితానికి అన్వయించి "మోసాన్ని మోసంతోనే జయించాలి"అందులో  తప్పేం లేదు అంటారు.
దీనికి ఉదాహరణగా  శ్రీకృష్ణుడిని చూపడం విశేషం.
మహా భారతాన్ని తీసుకున్నట్లయితే కృష్ణుడు కౌరవులు పాండవులు ఇద్దరికీ బంధువే.కానీ దుష్టులైన కౌరవులకు బుద్ధి చెప్పేందుకూ, దుష్ట శిక్షణ కోసం ఎన్నో మహిమలు చూపాడు.
పాండవ పక్షపాతి అనే అపవాదు తొలగించుకోవడానికి దుర్యోధనునితో యుక్తిగా ఓ మాట అంటాడు. "కురుక్షేత్ర యుద్ధానికి కోట్లాది మంది సైనికులు కావాలా? నేను కావాలా?" అడుగుతాడు.
కృష్ణుని మహిమలు, శక్తి ,బలాబలాలు తెలియని దుర్యోధనుడు కోట్లాది సైన్యమే కావాలని కోరుకుంటాడు.చతురంగ బలాలను దుర్యోధనుని పరం చేసి తాను పాండవుల పక్షాన నిలబడి ధర్మం గెలిచేలా చేస్తాడు.
ఇక కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా జరుగుతున్న సందర్భంలో కౌరవుల పక్షాన యుద్ధం చేస్తున్న ద్రోణాచార్యుడిని నిలువరించడం కోసం  సత్యవాక్పరిపాలకుడు అయిన ధర్మరాజుతో 'అశ్వత్థామ హతః' అనేలా చేస్తాడు.
 ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసేవిధంగా అతని కొడుకు అశ్వత్థామ చనిపోయాడని భ్రమ కలిగించే విధంగా పై మాటను అందరూ వినేలా  ధర్మరాజుతో  "అశ్వత్థామ హతః చెప్పించి  చివర్లో  ఆయన సత్య వ్రతానికి భంగం కలగకుండా చివర్లో 'కుంజరః ' అని అనిపిస్తాడు. అది ఎవరికీ వినపడకుండా ఉండేందుకు భేరీలు మోగేలా చేస్తాడు. అశ్వత్థామ కుంజరః  అనగా అశ్వత్థామ అనే ఏనుగు. కానీ చివరి మాట వినబడక ద్రోణాచార్యుడు కొడుకు చనిపోయాడనే దుఃఖంతో అస్త్ర సన్యాసం చేయడం.ఆ తర్వాత యుద్ధంలో మరణించడం మనకు తెలిసిందే.
ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణుడు 'మోసాన్ని మోసంతో జయించవచ్చు' అనే సందేశం ఇచ్చాడన్న మాట.
 చిన్నయ సూరి పంచతంత్ర కథలు,మర్యాద రామన్న కథలు, అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణుడి కథల్లో  మోసాన్ని మోసంతో ఎలా జయించవచ్చో తెలిపే కథలు చాలానే వున్నాయి.
 అమాయకులు మోసపోయే సమయంలో, అన్యాయం అక్రమాలు జరిగే సమయాల్లో ఇలా "కంటక న్యాయము" ఉపయోగించి ఆయా వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలి .
మంచిని రక్షించేందుకు, విలువలను కాపాడేందుకు  మనమూ ఈ "కంటక న్యాయము"తో తగిన శాస్తి చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు