సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -442
కందుక న్యాయము
     *****
కందుకము అంటే బంతి,చెండు.
రబ్బరు బంతిని కిందికి వేగంగా, విసురుగా పడేస్తే అంతే  వేగంతో మీదికి ఎగిరి పడుతుందని అర్థము.
 మరి మన పెద్దవాళ్ళు చెప్పిన 'కందుక న్యాయము' లోని అంతరార్థం ఏమిటో చూద్దాం.
 మనిషి అన్నాక ఎన్నో ఆటుపోట్లు,పొరపాట్లు, అగచాట్లూ తప్పవు. పొరపాట్లు మానవ సహజం.ఒకో సారి ఖేదం ,మరోసారి మోదం... వస్తూ పోతూ వుంటాయి. మోదానికి పొంగి పోతే ఫరవా లేదు కానీ ఖేదానికి కృంగి పోయి మట్టి ముద్ద వలె  స్తబ్దుగా వుంటే  అభివృద్ధి, ప్రగతి అనేవి వుండవు.
అలా మృత్పిండము వలె స్తబ్దతతో వుండటం వల్ల  మీకే కాదు మీమీద ఆశలు పెట్టుకున్న వారికి కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. చేతిలో ఉన్న మట్టి ముద్ద జారిపోతే మళ్ళీ లేవదు.అలాగే భూమిని కరుచుకుని ఉండి పోతుంది.ఇక పైకి లేవడం అనేది వుండదు.అలా వున్న  వ్యక్తి శక్తి హీనుడు, ఎవరికీ పనికిరాని వాడు అవుతాడు.
మరెలా వుండాలో మనకు తెలుసు కదా !రబ్బరు బంతిలా అంటే కందుకము వలె వుండాలి.అజాగ్రత్త వల్ల చేతిలోంచి జారిన  బంతి ఎంత ఎత్తు నుండి కిందకు పడుతుందో అంతే ఎత్తుకు పైకి లేస్తుంది.అలా వ్యక్తులు కూడా రబ్బరు బంతులు కావాలి.పొరపాట్లు  జరిగినా, అవమానాలు ఎదురైనా, అభివృద్ధిని అణగ ద్రొక్కాలని చూసినా  ఎంత తొక్కి పడితే అంత పౌరుషంతో పైకి లేచి తామేమిటో నిరూపించుకోవాలని ఈ "కందుక న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు.
భర్తృహరి రాసిన "కందుక న్యాయము"ను గురించి సుభాషిత రూపంలో  ఏం రాశారో చూద్దామా...
కందుకము వోలె సుజనుడు/గ్రిందంబడి మగుడ మీదికి నేనగయుజుమీ/మందుడు మృత్పిండము వలె/ గ్రిందంబడి యడగి యుండు గృపణత్వమునన్/"
"బంతి క్రింద పడి మళ్ళీ పైకి ఎగిరినట్లుగా మంచి వాడు హీన స్థితిని పొందినా తిరిగి వెంటనే ఉన్నత స్థితిని పొందుతాడనీ,దుర్జనుడైతే మట్టి ముద్ద కింద పడి అట్లే ఉండిపోయినట్లుగా హీన స్థితిని పొంది అట్లాగే వుండి పోతాడనీ,ఇక  ఎప్పటికీ ఉచ్ఛస్థితిని పొందడని అంటారు.
కాబట్టి మంచి వ్యక్తికి ఒకవేళ కాలం  కలిసి రాకపోయినా,  దురదృష్టవశాత్తు హీన స్థితి పొందినా, తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటాడనీ పూర్వ స్థితికి తప్పకుండా వస్తాడనీ‌ అంటారు.
ఇక దుర్జనుడు మాత్రం తన దౌర్జన్యంతోనో మరో విధంగానో  ఓ వెలుగు వెలిగినప్పటికీ, అతడి బండారం  ఎప్పుడైతే బయటపడుతుందో అప్పటి నుంచి ఇక అతడిది అధో గతే.మట్టి ముద్దలా హీన స్థితిలోనే వుంటాడు కానీ ఎప్పటికీ ఉన్నత స్థితికి చేరుకోలేడు.
అంటే ఈ "కందుక న్యాయము"లో రెండు కోణాలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు.నిరాశా నిస్పృహలకు లోనై అలాగే వుండిపోయేవారూ, దుర్జనత్వం కలవారు రబ్బరు బంతులు కాలేరు.మట్టి ముద్దలే అవుతారు.
మంచి వారు, తమను తాము తెలుసుకున్న వారు ఎలాంటి యిబ్బందులు, ఆటుపోట్లు ఎదురైనా వాటిని అవలీలగా ఎదుర్కొనే వారు బంతులు అవుతారు.కింద పడ్డా పైకి లేచి తామేంటో నిరూపించుకుంటారు.
 ఈ "కందుక న్యాయము" లోని అంతరార్థం ఏమిటో తెలుసుకున్నాం కదా! మనం సుజనులుగా వుందాం.ఎలాంటి సమస్యలు వచ్చినా అవన్నీ తాత్కాలికమేనని ధైర్యంగా ఎదుర్కొని బంతిలా మనమేంటో నిరూపించుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు