సగటు మనిషి ఆవేదన- సాహితీ సింధు, పద్య గుణవతి సరళగున్నాల
కందం
=====
తలపున నాలోచనలే
తెలిపెదనేదాకుండ స్థిరమతితోడన్
పలుకులస్వచ్ఛతగనుమా
పలికించును వ్యథలునెపుడు పరిపూర్ణముగన్

పిల్లల యూసులునొకచో
కల్లలు మాటాడు బంధు కాలురునొకచో
వెల్లువ మాటలయీటెలు
పల్లవమై గుచ్చునెద కవాటములందున్

వ్రాయుట లోన రికార్డులు
ప్రాయము వెంటాడగ బడి బాలలునొకచో
దాయాదులు మరినొకచో
మాయావులు ముంచు బాధ మరియొక చోటన్

ఇక్కడి యక్కడ చెప్పుచు
మక్కువ నటియించిచంపు మంథరలొకచో
వెక్కసమౌ ధనగర్వము
పెక్కైనను జూచుచూపు పీడౌనొకచో

అత్తామామల సేవలు
పెత్తనమున పలుకులాడ వెగటింకొకచో
సత్తెము వీడిన పలుకుల
చిత్తరువును దింపువారు చెదలౌనొకచో

ఒంటికి నంటిన బాధలు
జంటగనొకటెంటనొకటి చంపగనొకచో
మంటను తాళని వ్యథలే
వింటిగనెదలోనదిగెడు వేదనలోకచో

మనిషిని కూల్చగ నెట్టుల
మనగలడీభూమిపైన మనుషులలోనన్
తనువును మనసును వీడక
తనయునికిని మరచిపోవు తలరాతనుచున్
కామెంట్‌లు