సుప్రభాత కవిత -బృంద
రంగులు నిండిన బంగరునేల
పొంగులు వారె సొగసులు చూడ
నింగిని సాగే నీలిమబ్బులు
తొందర పడుతూ దిగివస్తుంటే

సాగే బాటను దారిపొడుగునా
ఇంపుగ తోచే వర్ణాలెన్నో
గమనపు అలసట మరిపించి
ఆహ్లాదంగా మురిపిస్తుంటే

అలవి కాని అందాలేవో
సాగేదారిని  సాక్షాత్కరించినా
ఆగే సమయం ఇవ్వని
ఆగని వేగం కాలానిది.

బ్రతుకుబాటలో కలిసే
పరిచయాలన్నీ సొంతం కావు
సొంతమనుకున్నవి కూడా 
మనతో కలిసిరాలేని కాలాలు

ఊహించని మలుపులు
ఊరించే  నెలవులూ
ఊరుకోనివ్వని కలలూ
ఊయలూపే తలపులు

గమనమే గమ్యమైన 
పయనం మనదైతే
బాటలోనే బ్రతుకు
వెదుకుతూ సాగిపోదాం

ప్రతి మాపొక మజిలీ
ప్రతి రేపొక బదిలీ
ప్రతిదినమొక ఉన్నతి
ప్రతిక్షణమొక బహుమతి

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు