రానా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పూల పరిమళంలా
కడలి కెరటంలా
ఏటిపైసాగే నావలా
తాజాతాజా పూవులా
రంగుల హరివిల్లులా
పరుగెత్తుకుంటు రానా 
పలుకరించనా
పులకరించనా

అరుణ కిరణంలా
జాబిలి వెన్నెలలా
తారల తళుకులా
మెరుపుల కాంతిలా
మోముపై చిరునవ్వులా
చెంతకురానా
కబుర్లుచెప్పనా
కుతూహలపరచనా

చెరకు రసంలా
చక్కెర పాకంలా
మామిడి పండులా
తేనె చుక్కలా
తేట తెలుగులా
తీపినందించనా
తనివితీరాత్రాగించనా
తృప్తికలిగించనా

పచ్చని అడవిలా
పారే సెలయేరులా
పక్షుల గుంపులా
పురివిప్పిన నెమలిలా
నీలాల నింగిలా
పొంకాలుచూపనా
పారవశ్యపరచనా
మనసునుదోచనా

తెల్లని మల్లెలా
విరిసిన రోజాలా
ఎర్రని మందారంలా
సన్నజాజి పువ్వులా
కమ్మని కనకాంబరంలా
ముందుకురానా
ముచ్చటపరచనా
మదిలోనిలిచిపోనా

ఊహలను ఊరించి
అక్షరాలను ఏరి
పదాలను పొసిగి
భావాలను తెలిపి
కవితను కూర్చి
అందించనా
చదివించనా
హాయిగొలపనా

నేనంతే
నాదారంతే
నాచూపటే
నాధ్యాసటే
నాగమ్యమదే
నాజీవితమదే
అర్ధంచేసుకుంటే
నాకుపదివేలదే

కామెంట్‌లు