సుప్రభాత కవిత ; - బృంద
కొండకోనలలో....
చిక్కగ అల్లుకున్న అడవిలో
ఆకుల కొమ్మల సందున
అటునిటు తిరిగి  చివరకు

కిరణములను నేలకు
జొప్పించి తాకి
వేల జీవాలకు ప్రాణశక్తిని
ధారపోసి..

ప్రవహించు జలధారల
పలకరించి కుశలమడిగి
పరుగుపరుగున పయనించి
శిఖరాల అంచులు తాకి

ఎవరూ రాలేని కఠినపు
దారులైన కనుగొని దరిచేరి
నేనున్నానంటూ చేయూతనిచ్చి
చైతన్యపు నిప్పు రాజేసి

దారితోచక సాగే బాటసారికి
కొత్త దారి కనుగొని గమ్యం చేరి
తనవెనుక నలుగురు నడిచేలా
దివిటీ పట్టుకు  దారిచూపే నేస్తంలా

క్రమం తప్పక ఆగమిస్తూ
సమంగా సృష్టిని కాస్తూ
నీమంగా అన్నిటినీ చూస్తూ
క్షేమంగా ఋతువులుమారుస్తూ

అడుగడుగున తోడుగా
అవసరమైనపుడు నీడగా
దిక్కు తోచక దిగులైనపుడు
చిత్తాన మెరిసే వెలుగులా

జగతికి సుగతినిమ్మని 
ప్రగతిరథ చక్రాల తేరులో వచ్చే
కమల బాంధవుని
దోసిలి యొగ్గి కోరుకుంటూ

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు