సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -441
కంఠ చామీకర న్యాయము
****
కంఠము అనగా కుత్తుక, గొంతు. చామీకరం అనగా బంగారము, ఉమ్మెత్త అనే అర్థాలు ఉన్నాయి.
బంగారు గొలుసును కంఠమునందు ధరించిన  విషయం మరిచిపోయి "అయ్యో! నా గొలుసు ఎక్కడో  పోయింది " అని ఏడ్చుకుంటూ అంతటా వెతుక్కోవడం అన్న మాట.
అలా వెతుక్కుంటూ  వున్న వ్యక్తిని చూసిన వాళ్ళు  అతడి మెడలో కనిపిస్తున్న గొలుసు చూపి 'అదేనా !' అని అడిగితే "అరెరే !మరచి పోయానే! అవును అదే! చూసుకోనేలేదు.'హమ్మయ్యా! వుందిలే అని స్థిమిత పడటం చూస్తూ ఉంటాం.
దీనినే తెలుగులో" చంకలో బిడ్డను ఉంచుకుని ఊరంతా వెతికినట్లు " అనే సామెతగా చెప్పుకోవచ్చు.
ఇలాంటి సంఘటనలు మన ఇళ్ళలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కళ్ళకు కళ్ళద్దాలు పెట్టుకుని వాటి కోసం ఇళ్ళంతా వెతికే వారూ, జేబులో పెన్ను తెచ్చుకున్నది మరిచి పోయి రాసేటప్పుడు అయ్యో మరిచిపోయానే అనుకుంటూ ఇతరులను అడగడం... వాళ్ళ అవస్థ చూసే వారికి నవ్వూ, 'అయ్యో!పాపం!అనే బాధ రెండూ కలుగుతాయి.
 మరి "కంఠ చామీకర న్యాయము"అంటే ఇదేనా? ఇందులో ఏముంది? అప్పుడప్పుడు ఎవరికైనా ఇలాంటివి ఎదురవుతూనే వుంటాయి కదా! అని పెదవి విరిచే ముందు మన పెద్దలు, పూర్వీకులు దీనిని ఓ న్యాయంగా  ఎందుకు చెప్పారో  చూద్దాం..
 పెద్ద వాళ్ళు,పూర్వీకులలో ఆధ్యాత్మిక వాదులు ఎక్కువగా వుండేవారు. వారు ప్రతిదీ ఆ దృష్టి కోణంలోనే చూసే వారు. దానిని జీవితానికి అన్వయించి చెప్పేవారు.
 ఇక్కడ కూడా అదే విధంగా ఈ న్యాయాన్ని మనిషికీ, మనసుకూ అన్వయించి చెప్పారు.
 ఆనందం కానీ ఆత్మ తృప్తి కానీ ఎక్కడో వెదికితే ఎలా దొరుకుతుంది? అది మనలోనే  లోలోపల ఉంది. మన మనస్సులోనే వుంది.మనలో వున్న ఆత్మను తెలుసుకుంటే ఆత్మ జ్ఞానం కలుగుతుంది.తద్వారా ఆత్మానందం అంటే ఏమిటో తెలుస్తుంది.
అయితే మనలో ఉన్న ఆత్మను గురించి తెలుసుకోవడానికి ,ఆత్మ జ్ఞానం పొందడానికి సామాన్యులమైన మనకు సాధ్యం కాదు అంటారు మన పెద్దలు. 
గురూపదేశము వల్ల మాత్రమే ఆత్మ జ్ఞానం కలుగుతుందని తప్పకుండా గురువు ముఖతా తెలుసుకోవాలని అంటుంటారు.
ఉపాధ్యాయుల ద్వారా శిష్యులు వివిధ విషయాలలో జ్ఞానాన్ని ఎలా  పొందుతారో   సద్గురువుల ద్వారా , శ్రద్ధ,ఆసక్తి ,ప్రయత్నం ద్వారా ఆత్మ జ్ఞానం పొందవచ్చు.
కాబట్టి మనల్ని మనం పోగొట్టుకోకుండా, మానవీయ విలువలతో జీవితం గడపాలంటే అసలు మనమేంటో తెలుసుకోవాలి. మనలోని ఆత్మ గురించి విచారం చేయాలి. మన జన్మ,మన జీవితం పట్ల  పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఇక ఆనందం, ఆత్మ తృప్తి లాంటివి ఎక్కడా వెతుక్కోవాల్సిన అవసరమే వుండదు.
అలా"కంఠ చామీకరం"లాంటి ఆత్మ జ్ఞానం మనలో ఎప్పుడూ వెలుగులీనుతూ మనమేంటో నలుగురికి తెలిసేలా చేస్తుంది.ఇంకెందుకు ఆలస్యం.ఆత్మ జ్ఞానం పొందడానికి ఇప్పటి నుంచే,ఈ క్షణం నుండే ప్రయత్నాలు మొదలు పెడదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు