ప్రభుత్వ పాఠశాలలు పల్లె ప్రగతికి పట్టుగొమ్మలు
 -ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య
-ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
-మహిళా టీచర్లను సన్మానించిన హెచ్ఎం 
ప్రభుత్వ పాఠశాలలు పల్లె ప్రగతికి పట్టుగొమ్మలని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. గురువారం ఆయన పాఠశాలలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
 గురువారం పాఠశాలలో మహిళా ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, చెన్నూరి భారతిలను శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న విద్యాబోధనారీతులతో పాఠశాల పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.   అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ మహిళల ఆలోచన ఉన్నతమైనదని, మహిళా శక్తి తోటే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఒక ప్రభుత్వ పాఠశాల ప్రజలందరి సమిష్టి ఆస్తి అని, అది ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదన్నారు. తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించని వారు కన్నతల్లిని దూరం చేసినట్లే అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నారని, కొందరు మాయమాటలు చెప్పి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యా సౌకర్యాలు వారికి అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆరుగాలం కష్టించి సంపాదించిన వేలాది రూపాయల డబ్బును పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు వృధా చేసుకుంటున్నారని, వారి కోసం చదువును కొనాల్సిన అవసరం లేదన్నారు. ప్రగతి రథచక్రాలాంటి ప్రభుత్వ పాఠశాలలు సకల సౌకర్యాలతో ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తుండగా, వేరే పాఠశాలలకు పిల్లల్ని  పంపించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అంకితభావం, అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత నాణ్యమైన విద్యాబోధన అందుతోందని, తల్లిదండ్రులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, ఉచిత నాణ్యమైన విద్యను పొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, చెన్నూరి భారతి, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు