సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం.
 న్యాయాలు-447
కాక దధ్యుప ఘాతక న్యాయము
*****
కాక అనగా కాకి, వాయసము, బలిపుష్టము, ధ్వాంక్షము ఆత్మఘోషము  అనే అర్థాలు ఉన్నాయి.దధ్య/ దధి అనగా పెరుగు.ఉప అనగా సమీపము,చెంత.దధ్యుప అనగా పెరుగు చెంత.ఘాతక అనగా చంపువాడు, నాశము చేయు వాడు..
పెరుగు చెంత వుండి కాకులు మొదలైనవి ముట్టకుండా కాపాడుట అని అర్థము.
" కాకేభ్యో రక్ష్యతాం సర్పి రితి బాలోపి చోదితః,ఉపఘాత పరే వాక్యే న శ్వాదిభో న రక్షతి?"
అనగా ఈ పెరుగును కాకులు ముట్టుకొనకుండా చూస్తూ వుండుమని చెప్పినట్లయితే, ఆ బాలుడు కాకులను తోలి కుక్కలు ముట్టుకోబోతే చూస్తూ వూరుకుంటాడా? ఊరుకోడు కదా! వాటిని కూడా తోలుతాడు,వెళ్ళగొడతాడని అర్థము.
 కాకి అనే శబ్దము చేతనే కుక్కలు మొదలైనవి కూడా అక్షిప్తము లవుచున్నవి అనగా ద్యోతకమవుతు న్నాయి.
 
 ఇలా ఒక పని గాని, విషయాన్ని గానీ చెప్పినప్పుడు, ఏదైనా ఒక సూచన చేసినప్పుడు అవి ఇతరములకు కూడా అన్వయించుకొమ్మని ఇందులోని నిగూఢమైన అర్థం.
 ఇలాంటి విషయాలను చర్చించుకునేటప్పుడు కొన్ని సరదా సంఘటనలు, పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు వస్తుంటాయి.
 అలాంటిదే ఓ సరదా సామెతను చూద్దాం."తిప్పడు తిరుణాళ్ళ పోనూ పోయాడు రానూ వచ్చాడు అన్నట్లు". ఒక యజమాని తన దగ్గర పనిచేసే వ్యక్తికి  వేరే ఊరిలో చేయాల్సిన పని అప్పగిద్దామని చెప్పే లోపలే  ఊరు వెళ్ళి వస్తాడు . చేయాల్సిన పని ఏమిటో వినడు అలా  వెళ్ళి రావడం వల్ల ఏమైనా ఉపయోగం వుందా? లేదు కదా! ఎటైనా వెళ్ళేటప్పుడు విషయానికి సంబంధించి ఎందుకు? ఏమిటి? అనేది తెలుసుకోవాలి.
దీనికి సంబంధించి చిన్నప్పుడు మా తాతయ్య చెప్పిన ఓ సరదా కథను చూద్దామా...
ఓ గురువు గారి దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవారు. అందులో ఓ శిష్యుడు మాత్రం ఎప్పుడూ గురువును అంటి పెట్టుకునే తిరిగే వాడు.
మిగతా శిష్యులు వంట చెరకు, కాయలు దుంపలు తేవడానికి అడవికి వెళ్ళారు. గురుపత్ని పొయ్యి మీద వంట గిన్నె పెట్టి నీళ్ళ కోసం ఏటికి వెళ్ళింది.
అలా వెళ్తూ భర్తైన గురువుకు ఇల్లు జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పింది.గురువుకు పూజా సమయం దగ్గర పడటంతో తాను పూజ చేసుకుంటున్నాననీ ఇంట్లోకి ఏమీ రాకుండా కాపలా కాయమని శిష్యుడికి చెప్పి వెళతాడు.గురువు మాట తు.చ. తప్పకుండా పాటిస్తూ అక్కడే కూర్చుని వుంటాడు.
ఇంతలో వంట చేసే పొయ్యి లోంచి నిప్పు రవ్వలు ఎగిసిపడి ఆశ్రమం అంటుకుని మండిపోతూ వుంటుంది.అయినా అలాగే చూస్తూ వుంటాడు.ఆర్పే ప్రయత్నం చేయకుండా లోపలికి ఏం పోవట్లేదు కదా అని మాత్రమే చూస్తుంటాడు.నీళ్ళకు పోయి వచ్చిన గురుపత్ని మండిపోతున్న  ఆశ్రమాన్ని చూసి లబోదిబోమని ఏడుస్తూ గురువును పిల్చుకు రమ్మనమని తాను తెచ్చిన నీళ్ళతో ఆర్పే ప్రయత్నం చేస్తుంది.
గతంలో గురువు గారు ఏదైనా సరే నిదానంగా చెప్పాలన్నది గుర్తొచ్చి "గురువు గారూ! మన ఆశ్రమం కాలి పోతున్నది.ఎంతో నిదానంగా ,నింపాదిగా చెబుతుంటే పూజలో ఉన్న గురువు ఒక్క సారిగా ఉలిక్కిపడతాడు ."అంత ఘోరం జరుగుతుంటే ఇంత నింపాదిగా చెబుతావేంట్రా! "అని మందలించి ఆశ్రమం దగ్గరకు వెళ్ళి చూస్తే ఏముంది? మొత్తం బూడిద .పక్కనే ఏడుస్తూ గురుపత్ని. చూడమని చెప్పినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, దానిని అడ్డుకొనే ప్రయత్నం చేయాలి కదా! ఇలాంటి వెర్రిమాలోకపు శిష్యుడి లాంటి వారు కొందరు వుంటారని ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలిగాం.
అందుకే కాకులు రాకుండా చూడమంటే కుక్కలు మొదలైనవి వస్తే చూస్తూ వుండమని కాదు.అవి కూడా రాకుండా చూడమనే కదా అర్థము.
ఇక కొంత మంది వుంటారు . వాళ్ళు చెప్పింది మాత్రమే చేసి  వస్తారు.చేయాల్సిన పనులు  కళ్ళకు కనిపించినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా చెప్పింది మాత్రమే చేస్తారు.
 ఇక మూడో రకం వారు మన హనుమంతుడి వలె "చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు" మిగతా పనులు కూడా పొల్లు పోకుండా చక్కబెట్టుకుని వస్తారు.
 ఇదంతా పైన చెప్పిన "కాక దధ్యుప ఘాతక న్యాయానికి" సంబంధించినదే. ఇలా ఒక పనిని కానీ, విషయాన్ని కానీ మిగతా వాటికి అన్వయించుకొని చేయడంలోనే విజ్ఞత, వివేకం కనబడతాయి.
 మనం మాత్రం పై కథలా  వెర్రి వెంగళప్పలా కాకుండా, హనుమంతుడిలా చూసి రమ్మంటే  కాల్చి రావడం  కాదండోయ్! చుట్టుపక్కల పరిశీలిస్తూ "కాక దధ్యుప ఘాతక న్యాయము" వలె విజ్ఞతతో పనులు చక్కబెట్టుకుందాం. ఏమంటారు?
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు