సుప్రభాత కవిత ; - బృంద
కెరటాల పరుగులకు
అలుపెందుకు రాదో మరి!
చేరలేని తీరాలను  తీరాలని
తపనెందుకు పోదో మరి!

నింగిని అందుకోవాలని
నిలువుగా ఎగిరినా
నీలమంతా ధారపోసి
నీటిలా మిగిలేనెందుకో?

కడలి ప్రేమ తెలిసినా
అడలి ఆర్తిగ పిలిచినా
దరికి చేరని వలపులా రవి
దవ్వునే ఆగి చూచేనెందుకో

మెరుపులెన్ని అద్దినా
మరుపు తెలియని అలలు
ముసిరిన మరుల తలచి
మరిమరి ఎగసి మురిసేనెందుకో?

కలవని తీరాల ప్రేమ
కనులకు తెలియనిదేమో
కలకాలం నిలిచిపోయి
కధగా మిగిలేనెందుకో!

తలపుల అలలెపుడూ
పెదవులు దాటవెందుకో
మది అడుగున పొరలై
నిలిచి పోయేనెందుకో?

తీరని తపనల మరిపించే
మారని మనసును మురిపించే
కోరని పెన్నిధి కొంగున కట్టుకుని
చేర రమ్మని దోసిట పోసే  వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸
కామెంట్‌లు