సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -440
కార్యార్థి న్యాయము
****
కార్యము అంటే పని, హేతువు,సంగతి,విధాయ కృత్యము, మత సంబంధమైన కర్మము అవసరము వ్యాజ్యము వివాదము ఫలము, ప్రయోజనము అనే అర్థాలు ఉన్నాయి.అర్థి అనగా పొందగోరు వాడు,ఇచ్ఛ గలవాడు అని అర్థము.
కార్య సిద్ధి కోరు వ్యక్తి గర్వం లాంటివి వదిలేయాలని అర్థము.
 ఏదైనా  ఒక కార్యం విజయవంతం కావాలంటే దానికి ఓ ప్రణాళిక, పద్ధతి అవసరం.ఇవి రెండు మాత్రమే ఉంటే సరిపోదు. మేధస్సు కూడా కావాలి. ప్రణాళిక, పద్ధతి రెండూ ఉన్న వ్యక్తి వద్ద దానిని సరైన రీతిలో చేయగలిగిన మేధస్సు లేకపోతే ఆ కార్యం సిద్ధించదు.
కాబట్టి ఈ మూడు కలిస్తేనే  కార్య విజయానికి మార్గం సుగమం అవుతుంది.
రామాయణంలో హనుమంతుడి పాత్ర,సుగ్రీవుని పాత్ర ఎంత ముఖ్యమైనవో చదువుకున్న మనందరికీ తెలుసు.
హనుమంతుని కార్య సాధనా పాటవం వలన సీతమ్మ వారి జాడ తెలిసింది.
హనుమంతుడు  సుగ్రీవుని వద్దకు వెళ్ళి శ్రీరామ చంద్రుని కార్యం గురించి చెప్పడంతో సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వస్తుంది. వెంటనే సుగ్రీవుడు వానర వీరులను రప్పించి అన్ని దిశలలో వెళ్ళే వారికి వెతకవలసిన స్థలాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతాడు.సమర్థుడైన హనుమంతుడు, అంగదుడు మొదలైన వారిని దక్షిణ దిశగా పంపుతాడు.ఇలా కార్య సాధనలో సరైన వ్యూహం, పధకం వుండాలనేది  దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
విజయ సాధనలో  మనసు, శరీరాల పాత్ర కూడా ముఖ్యమైనది. మనస్సుకు సంబంధించిన మేధస్సు, జ్ఞానం, సంకల్ప శక్తితో పాటు శరీరానికి సంబంధించిన కృషి విజయం సాధించడంలో,కార్య సిద్ధిలో  ప్రముఖమైన పాత్ర వహిస్తాయనేది ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.
ఈ విధంగా మనం వేసుకున్న ప్రణాళిక విజయవంతం కావాలంటే ముఖ్యంగా నిర్థిష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, దానికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించుకోవడం, ఆటంకాలు,ఎదురు దెబ్బలను సాహసంతో ఎదుర్కోవడం. కావలసిన సహాయాన్ని పొందడం, సానుకూల దృక్పథం కలిగివుండటం... ఇవన్నీ  వుండాలి.
ఇక వ్యక్తుల్లో ఉండకూడనివి కొన్ని వున్నాయి.అవే అహంకారం, గర్వం,లెక్కచెయని తనం, ఉదాసీనత మొదలైనవి. వీటిని తక్షణమే వదిలించుకుని పై విధంగా సాగిపోతే ఏ కార్యము తలపెట్టినా ఎలాంటి సందేహం లేకుండా  విజయం పొందడం తథ్యం.
ఇదండీ "కార్య సిద్ధి న్యాయము". కార్యము సిద్ధించాలని ఊరికే వల్లె వేస్తే కాదు దానికి సంబంధించిన తతంగం ఇంత వుంటుంది. "దిగితే కాని లోతు తెలియదు" అన్నట్లు విషయం గురించి లోతుగా అధ్యయనం చేస్తే కానీ మనం ఇన్ని విషయాలను తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు