సునంద భాషితం;- వురిమళ్ల సునంద,ఖమ్మం
 న్యాయాలు -451
కాచమణి న్యాయము
******
కాచ అనగా గాజు,ఒక నేత్ర రోగము, కాసు, దమ్మిడీ. మణి అనగా రత్నము, శ్రేష్టమైన వస్తువు అని అర్థము.
ఒకే రకంగా కనిపించి,ఒకే రకంగా ప్రకాశించినప్పటికీ గాజు గాజే మణి మణియే అని అర్థము.
 రాయీ రత్నం చూడటానికి రెండూ ఒకేలా కనిపించినా రాయి ఎప్పటికీ రత్నం కాలేదు.
అలాగే చూపులకు ఒకే విధంగా కనిపించినా లోలోపల దుష్టత్వం ఉన్న వ్యక్తి మంచి వారితో ఎప్పుడూ సమానం కాలేడు.
ఒక వేళ ప్రయత్నం చేసినా ఎప్పుడో ఒకప్పుడు అసలు విషయం/ గుణం బయట పడుతుంది.
 దీనికి సంబంధించిన మహాభారత కథను చూద్దామా...
 మహా భారతంలో కర్ణుని గురించి అనుకోగానే దాన వీర శూర కర్ణుడిగా అతని దాన గుణం గుర్తుకు వస్తుంది.
తాను చేరదీసిన కర్ణుడు దాన కర్ణుడని పేరు తెచ్చుకున్నాడు. కర్ణుడి వలె  కాదు అంతకంటే ఎక్కువ తాను కూడా దానం  చేసి దాన దుర్యోధనునిగా పేరు సంపాదించుకోవాలి అనుకున్నాడు. అనుకున్న తక్షణమే అడిగిన వారికి లేదనుకుండా దానం చేస్తానని ప్రకటన చేశాడు.
ఓరోజు ఒక మునీశ్వరుడు దుర్యోధనుని వద్దకు వస్తాడు. తాను ఓ యజ్ఞం చేయడానికి సంకల్పించాననీ, దానికి అవసరమైన సమిధలు/ కట్టెలు కావాలని అడిగితే  ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని పొమ్మని చెప్పాడు.
 మునీశ్వరుడు  వినయంగా నమస్కరించి రాజా! ఇప్పుడు కాదు. యజ్ఞం ప్రారంభానికి ముందు వచ్చి తీసుకుని వెళ్తానని అంటే దుర్యోధనుడు 'సరే' అంటాడు.
 రోజులు గడుస్తున్నాయి.ఈ లోగా వర్ష ఋతువు వచ్చింది. మునీశ్వరుడు దుర్యోధనుని వద్దకు వెళ్ళి తనకు కావలసిన కట్టెలు ఇప్పించమని కోరాడు.
 అప్పుడు దుర్యోధనుడు కొంచెం అసహనంగా  మునీశ్వరా! మొదట వచ్చినప్పుడే తీసుకుని వెళితే బాగుండేది. ఈ వర్షాకాలంలో మీకు సరిపడే ఎండు కట్టెలు లభించడం కష్టం.కాబట్టి    మరోసారి రండి  అని ఒట్టి చేతులతో పంపిస్తాడు.
ఆ మునీశ్వరుడు యజ్ఞం గురించి చింతిస్తూ కర్ణుని వద్దకు వెళ్ళి విషయం చెబుతాడు.
యజ్ఞం గురించి చింతించ వలదని చెప్పి ఎండు కట్టెల కోసం దుర్యోధనుడు తనకు ఇచ్చిన భవంతిని  కూలగొట్టించి అందులోని కలపను/ కట్టెలను మునీశ్వరునికి అందజేస్తాడు.అప్పుడు దుర్యోధనుడికి  కర్ణుడు ఎంత గొప్ప దాతనో  అర్థమైపోతుంది. దాన గుణంలో  కర్ణుడితో సరితూగలేనని  తాను దానం చేస్తానన్న ప్రకటనను ఉపసంహరించుకుంటాడు.
 మంచివైనా చెడ్డవైనా సహజ గుణాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి అని అర్థము.అప్పుడు  వ్యక్తుల్లో మంచి వారో, చెడ్డ వారో తెలుస్తుంది.
 అందుకే వేమన "నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు" అంటాడు.
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు/ తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా?/ చాటు పద్యములను చాలదా ఒక్కటి/ విశ్వదాభిరామ వినురవేమ!
అనగా నిజమైన మంచి నీలము ఒక్కటున్నా దానికి విలువ ఎంతో వుంటుంది.  తళుకు బెళుకు రాళ్ళు తట్టెడు వున్నా వాటి వల్ల ఉపయోగం లేదు.అలాగే చదువుకోవడానికి ఓ మంచి పద్యం కావాలి.
 ఇదండీ "కాచ మణి న్యాయము" లోని అంతరార్థం.మనది మణిలాంటి వ్యక్తిత్వమే కాబట్టి గాజు ముక్కలాంటి  వారితో  మనకు పోలిక అవసరం లేదు కదండీ! మనసున్న మణులమై సమాజంలో కర్ణుడిలా గౌరవాన్ని పొందుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు