సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -430
ఏక వృంత గత ఫల ద్వయ న్యాయము
*****
ఏక అంటే ఒక్కడు,ఒంటరి,స్థిరమైనది,మారనిది, సాటిలేనిది.వృంతము అంటే తొడిమ.గత అంటే గడచినది,నశించినది,పోవుట, కదలిక, గమనము.ఫల అనగా పండు,పంట, ప్రయోజనము, కార్యము, లక్ష్యము,సంతతి,కత్తి వాదర.ద్వయ అనగా జత, రెండు అనే అర్థాలు ఉన్నాయి.
ఒకే తొడిమకు రెండు పండ్లు ఉన్నట్లుగా.
 కొన్ని పండ్ల చెట్లకు ఒకే తొడిమకు రెండు పండ్లు కాస్తుంటాయి. అది   సహజం.మరి మన పెద్దవాళ్ళు దీనిని న్యాయముగా చెప్పడంలో  ఒక నిగూఢమైన అర్థం దాగివున్నది.అదేమిటంటే శ్లేష. ఒకే పదానికి రెండు లేక అంతకంటే ఎక్కువ అర్థాలు ఆశ్రయించి వుండటం.
 దీనిని ఇతర వ్యక్తుల గురించి వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడూ, లేదా దైవాన్ని రెండు రూపాల్లో కొలిచేటప్పుడూ, ఎవరినైతే అంటామో ఆ వ్యక్తికే అర్థమయ్యే విధంగా చురక వేసేందుకో.... ఇలా ఒకటి తెగడ్త మరొకటి పొగడ్తలా వుంటుంది.
మన తెలుగు సాహిత్యంలో కవులు  సంఘటనలు, సందర్భాలను బట్టి పద్యాలు,మాటల ద్వారా వ్యక్తీకరించడం చూస్తూ వున్నాం.
ఇవి చదువుతుంటే 'భలేగా రాశారే'  అనుకోకుండా వుండలేం. అవి మన కవుల రచయితల చాతుర్యానికీ, వారి  సాహిత్య  సృజనకు భాషా పటిమకు మచ్చుతునకల్లాంటివి. వాడుక భాషలో కూడా ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి.
 ముందుగా మన కవుల, సాహితీ వేత్తల మాటల్లోని  కొన్నింటిని చూద్దామా...
ఒకసారి ఆరుద్ర గారు తన మిత్రునితో రైలు ప్రయాణం చేస్తూ వున్నప్పుడు మిత్రుడు "మీకు ఈ ఊళ్ళో ఏమైనా భూములు ఉన్నాయా? అని అడిగాడట.అప్పుడే రైలు ఊరి పక్కన స్మశానం వైపు నుండి వెళ్తుంటే అటు వైపుగా చూపిస్తూ ఆ రుద్ర భూములన్నీ నావే కదండీ! అన్నారట. ఇందులో రుద్రభూమి అంటే స్మశానం అని అర్థం.ఆరుద్రగా ఆ భూములు తనవేనని చెప్పడం‌.ఇలా రెండు అర్థాలు స్ఫురించేలా చెప్పారట.
అలాగే శ్రీ శ్రీ గారిని ఓ స్టేషన్ లో చూసిన మిత్రుడు 'ఊరికేనా?'అని ప్రశ్నిస్తే 'ఆ... ఊరికే ' అన్నాట్ట. చూడండి రెండర్థాలు స్ఫురించేలా శ్రీ శ్రీ గారు ఎలా జవాబు చెప్పారో!
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలలో రామరాజ భూషణుడు ఒకరు.ఈయన గారిని భట్టుమూర్తి అని కూడా అంటారు.ఇతడు రాసిన హరిశ్చంద్ర నలోపాఖ్యానములో శ్లేష కనిపిస్తుంది.ఇది ద్వ్యర్థి కావ్యము కూడా.అంటే ఇందులో ఒకే పద్యంలో రెండు అర్థాలు వస్తాయన్న  మాట.అందులో ఒకటి నలుని పరంగానూ మరొకటి హరిశ్చంద్రుని పరంగానూ అన్వయించుకొని చదవాలి.
శ్రీనాథుడు లాంటి వారు రాసిన చాటు పద్యాలలో కూడా మనకు శ్లేష కనిపిస్తూ వుంటుంది.
కొంత మంది కవులు నిగూఢమైన అర్థంతో  ఒకరినొకరు దూషించుకున్న  సందర్భాలు కూడా ఉండటం విశేషం.
అలాగే కొన్ని వాక్యాలను చూద్దాం.
"మిమ్ముమాధవుడు రక్షించు గాక!ఇందులో 1. మిమ్ము మాధవుడు అనగా విష్ణువు రక్షించు గాక అని ఒక అర్థం.2. మిమ్ము ఉమాధవుడు అనగా శివుడు రక్షించు గాక అని మరొక అర్థం.
 మరొక వాక్యం "వాడి కత్తి తీసుకోండి." అనగా 1 వాడి ( వ్యక్తి) దగ్గర ఉన్న కత్తి తీసుకోండి అని అర్థం. 2. వాడిగా ఉన్న ( పదునుగా) కత్తి తీసుకోండి అని మరొక అర్థం.
"మావిడాకులు తెచ్చివ్వండి". ఇందులో కూడా శ్లేష ఉంది. ఒకటేమో మాకు విడాకులు "మా విడాకులు" తెచ్చివ్వండి. కలిసి వుండలేం అనే అర్థంతో వుంది. మరొకటి "మావిడాకులు తెచ్చివ్వండి."  ఇంట్లో తోరణాలకో పూజకో వాడుకుంటాం అని అర్థము.
ఇలా  రెండు అర్థాలు వచ్చేలా మాటలు, వాక్యాలు, పద్యాలతో సాహిత్య సృజన చేసి తెలుగు భాషను సుసంపన్నం చేసిన సాహితీ వేత్తలు ఎందరో ఉన్నారు.వారందరికీ వంద వందనాలు చెప్పుకుందాం.
  "ఏక వృంత గత ఫల ద్వయ న్యాయము" అంటే ఏమిటో తెలిసిపోయింది కదా!
ఏదో సరదాకు, ఎదుటివారికి ఇష్టం అయితే తప్ప, ఎవ్వరినీ నొప్పించకుండా అంటే  శ్లేషను వాడకుండా ఉందాం. అంతే కదండీ!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు