అందిస్తున్నా;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 ఒక సెలయేరు పెదవివిప్పినట్టు
ఒక శరత్కౌముది మాట్లాడినట్టు
ఒక కరుణారససింధువు రాలినట్టు
ఒక కురంగం సంతోషంతో ఎగిరినట్టు
ఒక శరణాగతబంధువు ఆశీర్వదించినట్టు
ఒక మలయమారుతం మంద్రధ్వని చేసినట్టు
ఒక తరంగం ఆనందంతో అంతరంగాన్ని తాకినట్టు
ఒక అద్భుత ప్రసూనపు పుప్పొడి పలకరించినట్టు
అద్భుతమైన నీరాక 
నా మనోయవనికపై దృశ్యమానమైంది
నీ కన్నులు కలువల రేకులైనాయి
నీ పలుకులు తేనెల వాకలైనాయి
నీ అడుగులు హంసల రాకలైనాయి
నీ స్వరం నిర్ఘర ఝరీ ప్రవాహమైంది
మేఘాలపొత్తిళ్ళలో పడుకున్న శరదిందులాంటి నీకు
హేమంతాన్నీ,వసంతాన్నీ కలిపి అంటుకడితే పుట్టిన
అపురూపమైన మొక్కలాంటి నీకు
ఆకాశాన్నించి ఒకముక్క కత్తిరించి
ఇంద్రధనువును రిబ్బనుగా కట్టి
దానికి చక్కని నక్షత్రాన్ని గుచ్చి
నామనసునే కానుకగా చేసి
నీకు అందిస్తున్నాను ప్రియా
సత్వరం స్వీకరించవూ!!!
**************************************
కామెంట్‌లు