సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -426
ఉష్ట్ర లగుడ న్యాయము
******
ఉష్ట్ర అనగా ఒంటె.లగుడ అనగా కఱ్ఱ,కట్టె, దండము అనే అర్థాలు ఉన్నాయి.
ఒంటె తనచేత మోయబడే కర్రల చేతనే తాను దెబ్బలు తింటుంది.
 అనగా మూర్ఖత్వంతో చేసే పనుల వల్ల మూర్ఖుడే నష్ట పోతాడనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 ఎలాగూ "ఉష్ట్ర లగుడ న్యాయము" గురించి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి. ఒంటె గురించి నాలుగు విషయాలు, విశేషాలు తెలుసుకుందాం.
 ఇసుకతో నిండిన ఎడారిలో  ఎలాంటి యిబ్బంది లేకుండా ప్రయాణం చేసే ఒకే ఒక జంతువు ఒంటె.  దీనిని ఎడారి ఓడ అంటారు.సముద్రంలో ఓడ ఎలా వెళ్తుందో ఎడారిలో ఒంటె కూడా అంత అవలీలగా ఎలాంటి యిబ్బంది పడకుండా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది.
ఎడారి ప్రాంతానికి చెందిన వారు, ఎడారిలో ప్రయాణం చేసేవారు ఒంటెను ప్రయాణ వాహనంగా , బరువులు మోసేందుకూ ఉపయోగిస్తారు.
 ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే అలా ఒంటి మీద మనిషి ఎక్కడమే కాకుండా తనతో పాటు వస్తువులను కూడా  మోయిస్తాడు. 
అలా మోయించే వాటిలో కర్రలు గట్రా  వుంటాయి కదా!
మరి  అందులోని కర్రతోనే ఒంటెను దండిస్తూ తన అదుపులోకి తెచ్చుకుంటాడు. అలా తాను మోసుకొచ్చిన కర్రతోనే దెబ్బలు తింటుంది.
 పెద్దవాళ్ళు ఈ న్యాయమును మూర్ఖుడితో ఎందుకు పోల్చి చెప్పారో ఆలోచిద్దాం.
 అసలు మూర్ఖుడు అంటే ఎవరు? ప్రశ్నకు వెర్రివాడు, తెలివితక్కువ వాడు, ఇంగిత జ్ఞానం లేని వాడు,అవివేకుడు, మూఢత్వం కలవాడు అనే అర్థాలు ఉన్నాయి. అలాంటి వారిని మార్చడం ఎవరి తరమూ కాదు.
అలాంటి వ్యక్తులను తమ చేతి కింద పనికి పెట్టుకునే యజమానులు  వారిచే రకరకాల పనులు చేయించుకున్నప్పటికీ, వాళ్ళ మూర్ఖపు చేష్టలను భరించలేక వాళ్ళు  చెడగొట్టిన పనులను చూపుతూ కటువైన మాటలతోనో,చేతలతోనో దండిస్తూ వుంటారు.
ఆ విధంగా మూర్ఖుడు తన మూర్ఖత్వంతో తనకే ముప్పు తెచ్చుకుంటాడు. అనగా ఎవరి మూర్ఖత్వం వారికే చేటు అవుతుందని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
పాపం మనకలాంటి మూర్ఖులు ఎవరైనా తారస పడితే వారికి కొంచెమైనా ఇంగిత జ్ఞానం తెలిసేలా చేద్దాం.
 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు