పరుల మేలు తలపెట్టవోయి- సి.హెచ్.ప్రతాప్
 పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు
వట్టి మాటలాడు వాడధముడు
అట్టి వాని బ్రతుకు టదియేల మంటికా
విశ్వధాబిరామ వినురవేమ!
పరుల మేలు చూసి ఓర్చుకోలేని వాడు అధముడు. ఇతరుల శ్రేయస్సును చూసి ఆనందించాలే తప్ప అసూయపడకూడదు. అలా అసూయపడే వాళ్ల బతుకు నిష్ప్రయోజనం.ఏదో ఒక ఫలితాన్ని ఆశించి స్వార్థ బుద్ధితో చేసే సేవ.. సేవ కాదు. సొంత లాభం కోసం చేసే సేవకులు తమ సేవకు ఎన్నో రెట్ల అధికమైన ఫలితాన్ని ఆశిస్తారు’’ అంటాడు కబీరు. సేవ అనేది పరుల మేలు కోసం చేయాలి కానీ, తను ఎంతో కొంత లాభపడాలని చేసే సేవ, సేవే కాదనేది కబీరు మనకు అందించే సందేశం.విస్తరాకు నుండి ఒక గొప్ప జీవిత సత్యం నేర్చుకోవచ్చు. వాడాక  పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే పొయేముందు ఒకరి ఆకలిని  తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి  ఆకుకు ఉంటుంది. సేవ  చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ సేవ చేయండి. మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని వాయిదా వేయకండి .   కన్ను   తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం అని నానుడి.
 పుట్టడం, గిట్టడం ఏ ఒక్కరి చేతిలో ఉండేవి కావు. కానీ మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక గొప్ప కార్యమని చెప్పవచ్చు. మట్టిలో కలిసే అవయవాలు మరో మనిషి శరీరంలోకి వెళ్లి నిత్య చేతనంగా నిలుస్తాయి. ఇది గ్రహించిన కొందరు ఆప్తులు మరణ అంచుల్లో ఉన్నప్పటికీ .. పరుల మేలు ఆలోచించి.. పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. అటువంటివారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి.   పరుల మేలు కోరటం, సంఘ శ్రేయస్సుకు అందరితో కలిసి నడవటం పరమ ధర్మపథంగా మన వేదాలలో చెప్పబడింది. కోటి ధర్మగ్రంథాల సారమంతా అర్థశ్లోకంలో చెబుతానని ఒక పండితుడు ‘పరోపకారం చేస్తే పుణ్యం, పరపీడన చేస్తే పాపం’ అని మరువరాని మాటని చెప్పాడు.
పర హితం మనస్పూర్తిగా కాంక్షించడమే మానవజీవిత సారమని వివేకానందుడు సైతం చెప్పాడు.
పరహితంలో పాటు దానగుణం , సేవా దృక్పధం వంటి సద్గుణాలను కూడా అలవరచుకోవాలి.
కామెంట్‌లు