సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -456
కాండాను సమయ న్యాయము
****
కాండము అనగా గ్రంథములోని ఒక భాగము, సమూహము, ఉదకము, బాణము, ఆకు యొక్క ఈనె,కాడ,వరిపోచ, చెట్టు బోదె, దండము, సమయము,ముండ్ల దుబ్బు,గుఱ్ఱము,ఏకాంతము అనే అర్థాలు ఉన్నాయి.
సమయము అనగా శపథము, కాలము, సంకేతము, ఆచారము, సిద్ధాంతము అని అర్థము.అను సమయము అనగా ఆచారము లేదా సిద్ధాంతము ప్రకారము అనే అర్థాలు ఉన్నాయి.
 
కాండానుసమయము అనేది ఆచార సంప్రదాయాలలోని ఒక పద్ధతి.దానితో పాటు మరో పద్ధతిని పరిచయం చేయడమే ఈ న్యాయము యొక్క ఉద్దేశ్యం.ఆ పద్ధతులేంటో చూద్దాం.
ఋత్విక్కులకు మధుపర్కాలు ఇవ్వడంలో రెండు రకాల పద్ధతులు వుంటాయి.అవి  ఒకటి పదార్ధాను సమయము అనగా వస్తువుల ప్రకారంగా ఇచ్చుట, రెండు కాండాను సమయము అనగా సమూహంగా ఇచ్చుట.
వరుస క్రమంలో వారందరికీ ఆసనాలను ఇచ్చి కూర్చోబెట్టి ఆ తర్వాత అర్ఘ్యము,పాద్యము మున్నగునవి వరుసగా ఇచ్చుటను పదార్థానుసమయము అంటారు.
ఇక సామూహంలోని  వ్యక్తులను ఒక్కొక్కరిని పిలిచి ఆసనము,పాద్యము, మధుపర్కము మున్నగునవి అన్నీ కలిపి ఇచ్చిన తర్వాత మరొకరికి అన్నియు ఇచ్చుట.ఈ క్రమములో అందరికీ ఇవ్వడాన్ని కాండానుసమయము అంటారు.
దీనిని మరింత స్పష్టంగా, సరళంగా చెప్పుకోవాలంటే పెళ్లి భోజనాలతో పోల్చి చెప్పవచ్చు.
ఆచారాలు సంప్రదాయాలు తు చ తప్పకుండా పాటించే వారు పెళ్లికి లేదా శుభకార్యాలకు వచ్చిన బంధువులు, స్నేహితులు మొదలైన వారిని  అందరినీ చక్కగా పీటలు వేసి ఆసనాలపై కూర్చోబెట్టి అందరికీ మొదట అర్ఘ్యం( చేతులు కడుక్కోవడానికి నీళ్ళు, పాద్యం (కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు) ఇచ్చేవారు.అనంతరం  పదార్థముల వారీగా వడ్డిస్తూ భోజనం పూర్తి అయ్యేవరకు కొసరి కొసరి వడ్డించేవారు. ఇది "పదార్థాను సమయము"నకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇక రెండోదైన "కాండానుసమయము"నకు ఉదాహరణగా నేటి బఫే పద్ధతిని చెప్పుకోవచ్చు.సమూహముగా భోజనం చేయడం కోసం వచ్చే వ్యక్తులకు ఒకేసారి వారి కంచాల్లో లేదా విస్తర్లలో అన్నీ ఒక్కసారే వడ్డించడం.
 ఇలా పెళ్ళిళ్ళు, పేరంటాలు .. మొదలైన వాటిలో ఎవరి అభిష్టానుసారం  వారికి నచ్చిన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది.అంత మాత్రానికి ఈ న్యాయము సృష్టించాల్సిన అవసరం వుందా? అనే ధర్మ సందేహం మన మనసును తొలుస్తూ వుంటుంది.
అయితే ఇందులో ఇమిడి ఉన్న  విషయం ఏమిటో? ఎందుకు ఈ న్యాయము చెప్పారో? చూద్దాం.
ఎవరైనా ఏదైనా  కార్యం తలపెట్టినప్పుడు అది విజయవంతం కావాలంటే కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టుకుంటారు.తమకు ఉన్న ఆర్థిక వనరులను పరిగణనలోకి తీసుకుంటారు.వాటిని దృష్టిలో ఉంచుకుని  ఖర్చు చేయడం పరిపాటి.
అలా ధారాళంగా ఖర్చు పెట్టే స్తోమత వుంటే "కాండానుసమయము"ను పాటించ వచ్చు.లేదూ ఉన్న దాంట్లో పొదుపుగా ఆచి తూచి ఖర్చు పెట్టే వారికి "పదార్థానుసమయము"ను అనుసరించవచ్చు.
 
అందుకే తమ తమ స్తోమతను గుర్తుపెట్టుకుని ఆయా పనులను చేయమని చెప్పడం కోసమే మన పెద్దలు ఈ "కాండానుసమయ న్యాయము"ను సృష్టించి వుంటారని మనకు ఈ పాటికి అర్థమైపోయింది.
కాబట్టి వివిధ కార్యాలు, కార్యక్రమాల నిర్వహణలో వీటిని గమనంలో పెట్టుకొందాం. వాటిని అనుకున్న  విధంగా విజయవంతంగా పూర్తి చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు