సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-438
కరభ దోహన చేసిన్యాయము
*******
కరభము అంటే గాడిద,ఖరము,ఒంటె,చేయి, హస్తము, మణికట్టు మొదలు చిటికెన వేలు మొదలు వరకు గల చేతి వెలుపలి భాగము, ఏనుగు పిల్ల, ఏనుగు తొండము మొదలైన అనేక అర్థాలు ఉన్నాయి. దోహనం అంటే పాలు పిదుకుట.
కరభ దోహనము అంటే గాడిద పాలు పిదకడం అని అర్థము.
భారత దేశంలో చాలా మంది  ముఖ్యంగా హిందువులు ఆవును ఎంతో పవిత్రమైనదిగా,గోమాతగా పూజించడం మనందరికీ తెలిసిందే.కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే ఆవు దాని కుటుంబం మానవులకు పెంపుడు జంతువులుగా వుండేవి.ఆవును పాలు అందించడానికి, దూడలకు జన్మనిచ్చేందుకు పెంచే వారు. ఎద్దులను బండ్లు లాగడానికి, వ్యవసాయ పనులకు,రవాణాకు ఉపయోగించేవారు.
మన చిన్నప్పుడు అక్షర మాల నేర్చుకున్న సమయంలో "అమ్మ, ఆవు,ఇల్లు, ఈగ అని చదువుకున్నాం. అమ్మ తర్వాత అమ్మ లాంటిది ఆవు అనేవారు.ఎందుకంటే ఆవు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి‌.వీటిలో ఉన్న తొమ్మిది అమినో యాసిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనీ,రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, దెబ్బ తిన్న కణాలు, కణజాలాలను బాగు చేయడానికి ఆవు పాలు సహాయ పడతాయని, వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ అధికంగా ఉన్నాయని పెద్దలు, పాలపై  పరిశోధన చేసిన శాస్త్ర వేత్తలు చెప్పారు.
 పూర్వం  పాల పొడి డబ్బాలు లేని కాలంలో తల్లి దగ్గర పాలు లేనప్పుడు శిశువులను ఆవు పాలతోనే పెంచేవారు.ఆవు పాలు త్వరగా జీర్ణం అవుతాయి.కాబట్టి పసిపిల్లలకు ఆవు పాలను పట్టేవారు.అమ్మ పాలంత మేలు ఆవుపాలు చేస్తాయి కాబట్టి ఆవును అమ్మలాంటిదనీ, గోమాత అని అంటుంటాం.
 ఆవు పాలకు అంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. కాబట్టే వేమన ఆవు పాలను,గాడిద పాలను పోలుస్తూ ఓ పద్యం కూడా రాశారు.అదేమిటో చూద్దామా.
 "గంగి గోవు పాలు గరిటడైనను చాలు/ కడివెడైన నేమి ఖరము పాలు/ భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు/ విశ్వధాభిరామ వినురవేమ"
అనగా మంచి ఆవు పాలు కొన్ని ఉన్నా  గరిటెడు అయినా చాలు అవి ఎంతో ఉపయోగకరమైనవి. మరి గాడిద పాలు కడవల కొద్దీ వున్నా ఆవు పాలకు సమానం కాలేవు. అలాగే భక్తితో చేసి పెట్టిన ఆహారము కొంచెమైనా చాలు అని అర్థము.
అయితే ప్రస్తుతం కాలం మారిపోయింది.ఆవు పాల కంటే గాడిద పాలకే బాగా గిరాకీ పెరిగింది.
గాడిద పాలలో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని, విటమిన్ ఎ,బి1,బి2,బి6,సి,డి తో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్ ఇ కూడా గాడిద పాలలో సమృద్ధిగా లభిస్తుందని చెపుతున్నారు. ఇంకా ఈ పాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉండటానికి సహాయ పడతాయని, రోగ నిరోధక శక్తి పెంచుతాయని అంటున్నారు.అందుకే గాడిద పాలు లీటరుకు పదివేల రూపాయల దాకా ధర పలుకుతోందట. ఓ చిన్న చెంచాడు పాలే యాభై రూపాయలట. ఈ లెక్కన చూస్తే గాడిద పాలకు ఎంత  గిరాకీ వుందో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
 ఇన్ని విషయాలు, వివరాలు తెలుకున్న తర్వాత మనందరికీ మనసులో ఒక్కటే మెదులుతూ వుంటుంది. రోజులు మారాయనీ.కేవలం బరువులు మోసే గాడిద ఈరోజు తన పాలతో ఎంతో  పేరు తెచ్చుకోవడం భలే ఆశ్చర్యంగా వుంటుంది.పోషక విలువల పరంగా చూస్తే ఆవు పాల కంటే గాడిద పాలలోనే ఔషధీయ గుణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసిపోయింది కదండీ.
ఆవు పవిత్రతకు  ఎలాంటి లోటు లేకున్నా, రాకున్నా పాల పరంగా గాడిద పాలు ఈ కాలంలో పై చేయి కావడం  విశేషం.ఎప్పుడో రాసిన వేమన పద్యాన్ని మార్పు చేసి  రాసుకోవాలిప్పుడు.కాల మహిమ అంతే కదండీ!.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు