సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-436
కమఠీ దుగ్ధ పాన న్యాయము
*****
కమఠం అనగా తాబేలు.కమఠీ అనగా ఆడ తాబేలు.దుగ్ధము అనగా పాలు,పితుకబడినవి. పానము అనగా త్రాగుట, మద్యపానము,కాపాడుట అనే అర్థాలు ఉన్నాయి.
 తాబేలు పాలు తాగుట అని అర్థం.
 ఏది ఆడ తాబేలో? ఏది మగ తాబేలో? గుర్తించడమే చాలా కష్టము.అలాంటిది ఏకంగా దాని పాలు పితికి తాగడం  అనేది వుంటుందా? ఉండదు.అది అసంభవం.ఎందుకంటే తాబేలు గుడ్లు పెడుతుంది.క్షీరదము కాదు.మరి దాని పాలు ఎలా పితుకుతాం చెప్పండి? లోకంలోనే ఇది చాలా అసంభవమైన పని.
వెనకటికి ఎవరో  అన్నాట్ట "దున్నపోతు ఈనిందంటే ...దుడ్డెను కట్టెయ్యమని". అన్నారట.అలాంటిదే ఈ న్యాయము కూడా.
ఈ న్యాయము లోని విషయాన్ని చూస్తే అసందర్భ ప్రేలాపన లాంటిదని లేదా కావాలనే ఎదుటి వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆట పట్టిస్తూ వుండటమని  మనకు ఇట్టే తెలిసిపోతుంది .
కొందరు గోరంతలు కొండంత చేసి చెబుతుంటారు. అయితే అందులో గోరంతైనా నిజం వుంటుంది కానీ.మనం చెప్పుకునే ఈ న్యాయములో ఆవగింజంత కూడా సత్యం లేదనేది సుస్పష్టంగా తెలిసిపోతోంది.
ఇలా అసత్యాలకు అందమైన  మాటకారి తనపు చెమ్కీలు అద్ది అసంభవాలను సంభవాలుగా చెప్పే ప్రయత్నం చేసేవారు కొందరు మన చుట్టే వుంటారు.కాబట్టి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసమే ఈ "కమఠీ దుగ్ధ పాన న్యాయము"ను  మన పెద్దలు సృష్టించారనడంలో  ఎలాంటి సందేహమూ లేదు.అందుకే 'పెద్దల మాట చద్ది మూట' లాంటిది మేలే తప్ప కీడు వుండదు.వారి మాటల్లో జాగ్రత్త పడమనీ, మోసపోకుండా వుండమని చెప్పే  హెచ్చరిక,మేలు కోరుతనం రెండూ వుంటాయి.
 కాబట్టి పెద్దవాళ్ళ మాటలను సదా గమనంలో పెట్టుకొని అబద్ధాలు సృష్టించి  చెప్పేవాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అబద్ధాలు సృష్టించి చెప్పేవాళ్ళు కొందరైతే అందులో  నిజానిజాలు తెలుసుకోకుండానే  వారికి తాన అంటే తందానా అని వంత పాడే వారు మరి కొందరు వుంటారు.
అలాంటిదే "ఇదిగో పులి అంటే ఇదిగో తోక"ఇలాంటివి  సృష్టించి బలహీన మనస్కులను మరింత బలహీనులుగా, అమాయకులను మరింత తెలివిలేని వారిగా తయారు చేసి వారికి ఉన్న సొంత ఆలోచనల మెదడును ఎందుకూ పనికి రాకుండా తుప్పు పట్టి పోయేలా చేస్తారు.
ఇలాంటివి అన్నీ పరిహాసానికి తప్ప ప్రామాణికానికి నిలువవు. కాబట్టి ఇలా మాటల్లోనో, సామెతల రూపంలోనో   చెప్పిన పెద్దవాళ్ళ మాటలను పెడచెవిన పెట్టకుండా బుద్దిగా విని అర్థం చేసుకుందాం. మనమూ సమయం వచ్చినప్పుడు ఇతరులకు  హితైషులుగా మారుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు