సుప్రభాత కవిత ; - బృంద
ఊహకు ఊపిరి పోసే
ఉదయకాంతుల శోభలు
ఒక్కో రేకూ విప్పి వేచిన
కమలానికి సంబరాలు

దాచలేని దరహాసాల
ధగధగల దోబూచులాటలో
దరికి చేరవచ్చు కిరణాలకై
వేయికనులతో నిరీక్షణలు

గగనపు యవనిక పైన
తూరుపు వేదిక సిధ్ధం కాగా
పుత్తడి వెలుగుల తోడుగా
మెత్తగ అడుగులు పడగా

అరుదెంచు  ఆప్తమిత్రుని
ఆగమన అపురూప క్షణాలకై
మునివేళ్ళమీద నిలబడి
కనులార్పక చూచే జలజాలు

నీమము తప్పక ఏతెంచు
దినకరుని ప్రేమ మీరా
స్వాగతించి సన్నిధిలో
మోకరింప వేచి చూచు జలదాలు
పరవశించి  పరిమళింప ప్రకృతి 
పల్లవించి భూపాలమాలపింప
స్వర రాగ మధురిమను కొనితెచ్చి
వినిపించే మలయమారుతం

వీక్షించు ఆకాంక్షతో నిరీక్షింప
అపేక్షగా పలకరించు
తొలిసంధ్యకు

🌸🌸 సుప్రభాతం🌸🌸
కామెంట్‌లు