సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -443
కమ్బల ( కంబళ)నిర్ణేజన న్యాయము
*****
కంబళి అంటే ఉత్తరీయము, కంబళి పురుగు, గంగ డోలు, నీరు అనే అర్థాలు ఉన్నాయి. నిర్ణేజనము అనగా నీటితో కడుగుట.
కంబళిని నీళ్ళలో  ముంచి కాళ్ళకు బాదుతూ దులిపినట్లు
మంచాల మీద వేసుకోవడానికి, కప్పుకోవడానికి చాలా  మందంగా ఉన్న పెద్ద పెద్ద దుప్పట్లు ప్రతి ఇంట్లో ఉంటాయి.ఇప్పుడంటే  బట్టలు ఉతికే యంత్రాలు వచ్చాయి కానీ ఒకప్పుడు చాకి రేవుకు వెళ్లి అక్కడ బండమీద  బాదుతూనో లేదా కాళ్ళ మీద బాదుతూ ఉతికే వారు.
అలా  కాళ్ళకు బాదుతూ ఉతికి దులుపుతూ నీళ్ళలో తీస్తూ వుంటే ఆ కంబళికి ఉన్న దుమ్ము ధూళి వదిలి పోతుంది.దానితో పాటు కాళ్ళకు అంటిన మట్టి కూడా పోతుంది.ఇలా  కంబళి శుభ్రం కాళ్ళ దుమ్ము  పోవడం అనే రెండు పనులు జరిగాయి.ఈ విధంగా ఒక్క పని వల్ల రెండు రకాల లాభాలు కలిగాయన్న మాట.
 దీనినే "ఏకా క్రియా ద్వ్యర్థకరీ" అంటారు.
ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు దాంతో పాటు చేయవలసిన మరో పని కూడా పూర్తి అయితే దానిని "కంబళ నిర్ణేజన న్యాయము"తో పోల్చవచ్చు.
ఈ న్యాయమునే తెలుగులో "ఒక్క దెబ్బకు రెండు పిట్టలు" అంటారు.ఒకే పనితో రెండు కార్యములు చేయడానికి ప్రయత్నించినపుడు అవి నెరవేరిన సందర్భంలో ఈ సామెతను వాడుతారు.అంటే ఒకే పనికి రెండు ప్రయోజనాలు చేకూరడం .
 దీనికీ సంబంధించిన ఓ ఆసక్తికరమైన శ్లోకాన్ని చూద్దామా...
'ఏకో మునిఃకుంభ కుశాగ్ర హస్త/ఆమ్రచ్ఛ మూవే సలిలం దదాతి/ఆమ్రశ్చ సిక్త! పితరశ్చ తృప్త/ ఏక క్రియా ద్వ్యర్థకరీ ప్రసిద్ధా!!"
అనగా ఓ మునీశ్వరుడు పితృదేవతలకు తర్పణాలు  మామిడి చెట్టు మొదట్లో వదిలాడు. అందువల్ల రెండు రకాల ప్రయోజనాలు కలిగాయి.ఆ మునీశ్వరుని తర్పణ కార్యక్రమంతో పాటు చెట్టుకు కొన్ని నీళ్ళు పోసిన పుణ్యం లభించింది.
 మరి పైకి కనిపించినట్లు కేవలం దుమ్ము ధూళి వదిలి పోవడం, కాళ్ళు శుభ్రపడటం అనేవేనా ఈ న్యాయములో ఇంకేదైనా అంతరార్థం వుందా మన పెద్దవాళ్ళ కోణంలో ఆలోచిస్తే...
 అప్పుడప్పుడు ఇంట్లో భార్యాభర్తల మధ్యనో తల్లిదండ్రులు పిల్లల మధ్యనో చిన్న చిన్న విభేదాలు తలెత్తుతుంటాయి.వాటిని పరిష్కరించుకోవడానికి మాటా మాటా విసురు కోవడం ముఖ్యమా? మౌనంగా వుండటం ముఖ్యమా? అనే ఆలోచన వచ్చినప్పుడు మౌనమే ముఖ్యం అంటారు.మౌనం వల్ల వాదన పెరగదు. ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.ఇలా మౌనం వల్ల రెండు రకాల లాభాలు ఉన్నాయి.
కొందరికి పుణ్యక్షేత్రాలు దర్శనీయ స్థలాలు చూడటం అంటే చాలా ఇష్టంగా వుంటుంది.వీటి వల్ల కొత్త ప్రదేశాలు, ఆయా సంస్కృతి సంప్రదాయాలు  చారిత్రక విశేషాలు తెలియడమే కాకుండా మానసికోల్లాసం కలుగుతుంది.
అలాగే పరోపకారం భూతదయ వల్ల  మానసిక తృప్తి కలగడమే కాకుండా అవి పొందిన వారికి మేలు కలుగుతుంది.
 "కంబళ నిర్ణేజన న్యాయము"ను ఎన్ని రకాలుగా అన్వయించుకొని చెప్పుకోవచ్చో తెలిసిపోయింది కదండీ!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు