సుప్రభాత కవిత ; - బృంద
ఆకాశంలో నడవాలని 
అందనివేవో అందుకోవాలని లేదు
అవనిపై దారి తప్పక నడచి
ఆత్మ గౌరవం నిలబెట్టుకుంటే చాలు.

కోరిన తీరాలన్నీ 
చేరుకునే తీరాలని లేదు
కమ్మగ సాగే జీవితాన
కుదురుగ వుంటే చాలు.

దూరంగా జరిగిపోయి ఒంటరిగా
స్వేఛ్ఛగా  వుండాలని లేదు
అందరిలో ఉంటూ నా ఇష్టం ఇదీ..
అని ఒప్పించగలిగితే చాలు

మెచ్చుకుని పొగిడి
మేనాలెక్కించాలనిలేదు
మాటలతో నొప్పించక
మనిషిగా గుర్తిస్తే చాలు

సన్మానాలు శాలువాలు
సత్కారాలు అవసరంలేదు
ఏమీతెలియదని తిరస్కరించకుండా
ఆలోచనకు  మాటకూ విలువిస్తే చాలు

ఏ పరిస్థితినైనా తట్టుకుంటూ
పడినా లేచి నిలబడుతూ
సమయానికి తగ్గట్టు సర్దుకుంటూ
బాధ్యతలను బాధ్యతగా మోస్తూ

ప్రశ్నిస్తే ప్రతిపక్షమంటూ
తప్పు ఖండిస్తే తలపొగరంటూ
బుర్ర వాడితే బరితెగింపంటూ
బిరుదులు అందుకుంటూ ఎదిగి

ధైర్యంగా ధ్వజంలా నిలబడి
ఇంటిని కోవెలగా మార్చి
అందరికీ అన్నీ అందేలా చూసే
అతివలందరికీ అభినందనలతో

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు