సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం.
 న్యాయాలు-445
కలంజ న్యాయము
****
కలంజము అంటే పక్షి, గంజాయి,విష లిప్త బాణముచేత చంపబడిన మృగ మాంసముఅనే అర్థాలు ఉన్నాయి.
 
కలంజము అంటే తెలిసిపోయింది కదా!ముఖ్యంగా విష లిప్త బాణముచేత చంపబడిన మృగ/ పశువు మాంసమని. మరలాంటి విషము చేత చంపబడిన పశువు మాంసం తిన్న మనుషులకు హాని కలుగుతుంది.మరణం కూడా సంభవించవచ్చు.కాబట్టి "న కలంజం భక్షయితవ్యం న లశునం నగృంజనం చ" అని అధికారికంగా దానిని ఓ విధి వాక్యము, శాస్త్రబద్ధం చేశారు.
ఇందులో గృంజనము అంటే కూడా వెల్లుల్లి మరియు విషము తిన్న పశువు యొక్క మాంసమని అర్థము. ఇప్పటికీ వెల్లుల్లిని చాలా మంది తినరు.దానిని నిషిద్ధ పదార్థంగా భావిస్తారు.కొన్ని కుటుంబాల్లో , కొన్ని పూజలు, వ్రతాలు,ఉపవాసాల్లో ఉల్లి, వెల్లుల్లి పూర్తిగా నిషిద్ధము.వాటిని వంటకాల్లో అస్సలు  ఉపయోగించరు.
ఈ విధంగా శాస్త్ర మీమాంస శాస్త్రజ్ఞులు "అభక్షణం కర్తవ్యం" అనగా తినరానిది కాబట్టి తినకుండా ఉండాలనీ, "భక్షణం న కర్తవ్యం" తినడం అనేది చేయకూడనీ... ఇలా ఎటు తిప్పి చెప్పినా అర్థము ఒక్కటే.అలాంటివి తినకూడదని, వాటిని  ఓ సిద్ధాంతంగా చెప్పారన్న మాట.
అలా చెప్పడం వల్ల వినే వారికి భయం, భక్తి రెండూ కలుగుతాయి.తింటే ఏ ఆపద సంభవిస్తుందోనని భయం ఒకవైపు అయితే, పెద్దలు చెప్పిన మాట కాబట్టి ఖచ్చితంగా ఆచరించాలనే భక్తి మరోవైపు.ఇలా రెండు విధాలుగా మనుషులను అలాంటి పనులు చేయనీయవు.
ఇక మన ఇళ్ళల్లో పాటించే ఆచార వ్యవహారాలు గమనిస్తే  ఇలాంటి విషయాలు చాలా  చాలా తెలుస్తాయి.
అందులో కొన్నింటిని చూద్దాము.
ఇప్పుడంటే గడపలకు  రంగులు వచ్చాయి.గతంలో గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు , బియ్యం పిండి బొట్లు పెట్టే వారు.పసుపు క్రిమి సంహారిణి కాబట్టి క్రిమి కీటకాలను లోపలికి రానివ్వకుండా వుంటుందని  పెద్ద తరానికి తెలుసు.
అలాగే ఎంత ఖరీదైన చెప్పులయినా గడప దాటి లోపలికి తీసుకొని రాకూడదని కట్టడి  చేసేవారు.కారణం బయట తిరిగినప్పుడు అనేక కలుషితాలు చెప్పులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. వాటి వల్ల అనారోగ్యం కలుగుతుంది.కాబట్టి  ఎంత ఖరీదైన పాదరక్షలైనా వాటి స్థానం గడపవతలే అనే వారు.
 ఇలా ఎన్నో , ఎన్నెన్నో ఆరోగ్య సూత్రాలను ఆచారాలకు ముడిపెట్టి చెప్పారు. అందులో భాగంగా ఇదీ ఒకటని అర్థం చేసుకోవచ్చు.
 మామూలు మాటల్లో చెబితే ఎవరూ వినరు,ఆ మాటలు అస్సలు పట్టించుకోరని మన  పెద్దవాళ్ళకు తెలుసు. అందుకే ఎన్నో మంచి అలవాట్లనూ, ఆరోగ్య సూత్రాలను సంస్కృతీ సంప్రదాయాల పేరుతో ఆచార వ్యవహారాలకు ముడిపెట్టి వాటిని ఆచరించే విధంగా మానవ జీవితంలోకి ప్రవేశపెట్టారు.
 చాలా మందికి  ఈ ఆచార వ్యవహారాల సంగతేమిటో తెలియకున్నా ఫర్వాలేదు.  పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఆచరణలో వాటిని చూపమని అన్నారు.
అలాంటి వాటిలో "కలంజ న్యాయము"ముందు వరుసలో ఉంటుందనడానికి ఎలాంటి సందేహమూ లేదు‌అంతే కదండీ!
 మనము కూడా ఆచారాల వెనుక ఉన్న ఆంతర్యం, ఆరోగ్య సూత్రాల నియమాలు తెలుసుకుని సంతోషంగా ఆచరిస్తూ, అందులోని మంచిని నలుగురు గ్రహించి ఆచరించేలా చూద్దాం .మన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు