మహిళలు అన్నింటా ముందుండాలి
 మహిళలంతా చైతన్యవంతులై అన్నింటా ముందుండి సమాజాభివృద్ధికి దోహదపడాలని వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అన్నారు. 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ తొలుత 1857 మార్చి 8వ తేదీన అమెరికాలో ఒక కాటన్ మిల్లులో మహిళలంతా పురుషులతో సమానంగా వేతనాలు చెల్లించాలంటూ చేసిన సమ్మె విజయవంతమైందని, అలా మహిళా చైతన్యానికి నాటి ఉద్యమం నాంది పలికిందని అన్నారు. ఉపాధ్యాయని పాలవలస శారదాకుమారి మాట్లాడుతూ ఓటుహక్కు కల్పించాలంటూ న్యూయార్క్ లో వేలాదిమంది మహిళలు చేసిన 1500 ప్రదర్శనల ఉద్యమం ఫలించిందని, అమెరికా ప్రభుత్వం 1909 మార్చి 8వ తేదీన తమ దేశంలో ప్రతీ యేటా జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించుకున్నారని ఆమె గుర్తు చేసారు. ఉపాధ్యాయులు గోగుల సూర్యనారాయణ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి అధికారికంగా 1977 మార్చి 8వ తేదీ నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించడం వెనుక ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తమ హక్కులను సాధించుకున్న అంశాలను వివరించారు. ఉపాధ్యాయని దానేటి పుష్పలత మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించేందుకై వివక్ష చూపకుండా ఇంకా సమాజంలో పరివర్తన రావలసిన అవసరం ఉందని అన్నారు. ఉపాధ్యాయులు సిద్దాబత్తుల వెంకటరమణ మాట్లాడుతూ ఎక్కడైతే స్త్రీలు పూజించబడుతారో ఆ ప్రాంతంలో దేవుళ్ళు సంచరిస్తారని విశ్వసించే,  మాతృదేవోభవ అంటూ తొలుత అమ్మనే దైవంగా కొలిచే సంస్కృతి భారతదేశం సొంతమని అన్నారు. 
ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మహిళాభ్యున్నతికి సంబంధించిన గీతాలను ఆలపించారు. 
అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు హెచ్.ఎం.బలగ నాగమణి, పాలవలస శారదాకుమారి, దానేటి పుష్పలతలను ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు