మూగబోతున్న కవిస్వరం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మొన్నేమో
చెప్పాల్సింది ఏమిలేకపోయినా
కంచు మోగినట్లు
గంట కొట్టినట్లు
గలగలా పాడితే
చెవులు నిక్కరించి
ఉత్సాహం చూపించి
ఇంకా ఇంకాసాగించమని
చెవులుతెరచుకొని విన్నారు 

నిన్నేమో
చెప్పాల్సింది కొద్దేకనుక
చిన్నగా
మెల్లగా
గానమాలపిద్దామంటే
అరకొరగా వచ్చారు
వినీవిననట్లున్నారు
తెలిసీతెలియనట్లున్నారు
తొందరగా ముగించమన్నారు

నేడేమో
చెప్పవలసింది చాలాయున్నదికనుక
గట్టిగా లోతుగా
తీపిగా తేటగా
భాధ్యతగా గళమెత్తుదామనుకుంటే
ఎవరూ వినిపించుకోవటంలేదు
వద్దని వారిస్తున్నారు
ముగించాలని కోరుతున్నారు

రేపేమో
చెప్పబోయేది లెక్కలేనంతకనుక
నోరును తయారవమంటే
ధిక్కరిస్తుంది
బెట్టుచేస్తున్నది
పలుకులుపెగలించకున్నది
గొంతు మూసుకుంటున్నది
మనసు మౌనందాలుస్తుంది
వినేవారు ఎవరుండరంటున్నది

ఎందుకో
స్వరమిప్పాలని తంటా
మురిపించాలని ముచ్చటా
ఆగకుండా
అద్భుతమగా
అలరించేలా
రాయాలని ఆశ
పాడాలని ప్రయాస
శ్రోతలనాకర్షించాలని తపన

కవిరాతలను
ప్రోత్సహించండి
కవిసమ్మేళనాలు
నిర్వహించండి
కవిబ్రహ్మలను
సత్కరించండి
కవిస్వరాలను
మూగబోనియ్యకండి
భాషనుబ్రతికించండి

కామెంట్‌లు