ఓటు (మణి పూసలు);- కరణం మాణిక్ రావు -తాండూరు, వికారాబాద్ జిల్లా -చరవాణి: 9440481750

 1.
ఓటు విలువను తెలుసుకో 
ఆయుధముగా మార్చుకో 
ఎన్ని ఆశలు చూపినా...
నీతి పరులను ఎంచుకో.
2.
తాయిలాలు ప్రకటిస్తరు
తనేమిటో  చెప్పెస్తరు
మోసపోకు ఓటరన్న...!
తనది తాను కానిస్తరు.
3.
వంగి వంగి దండాలు 
వద్దంటె విన్నపాలు 
ఉత్తమాట ఓటరన్న...!
ఉన్నవన్ని తమ పాలు.
4.
మధ్యమాశ చూపిస్తరు
మత్తులోకి దింపెస్తరు
జర పైలం ఓటరన్న...!
జబర్దస్తి చేసెస్తరు.
5.
అన్ని చేస్తమంటారు
అణిగి మణిగి వుంటారు
గెలిచినంక ఓటరన్న...!
పట్టనట్టు వుంటారు.
6.
పొగడ్తలకు పొంగిపోకు 
ప్రమాణాలు చేయబోకు 
తెలుసుకో ఓటరన్న...!
నీకు నీవె మోసపోకు.
7.
డబ్బులు పంచనోణ్ణి
గొప్పలు చెప్పనోణ్ణి
గెలిపిద్దాం ఓటరన్న...!
సమదృష్టి కలవాణ్ణి.
8.
స్వార్థపరుడు కానివాణ్ణి
స్వాభిమానమున్నవాణ్ణి
గెలిపిద్దాం ఓటరన్న...!
దేశ సేవ చేసెవాణ్ణి.
9.
సంస్కృతిని నిలిపేవాడు 
సంఘజీవి యైనవాడు
కావాలి  ఓటరన్న...!
సమభావన వున్నవాడు.
10.
ఓటరుగా గర్విద్దాం
ఓటును వినియోగిద్దాం 
సమసమాజ స్థాపనకై 
సమర్థుణ్ణి గెలిపిద్దాం.
కామెంట్‌లు