ఆవు మెచ్చిన పులి - డా.ఎం.హరికిషన్-కర్నూలు-94410322122.
 ఒక అడవిలో ఒక పులి వుండేది. అది చానా మంచిది. ఆకలేసినప్పుడే జంతువులను చంపేది. కానీ చిన్న చిన్న జంతువులను అస్సలు ఏమనేది కాదు. పెద్ద పెద్ద జంతువులను, చెడ్డవాటినే వేటాడేది. మిగతా సమయాల్లో అన్నింటితో మంచిగా మాటలాడేది. పలకరించేది. బాధల్లో వున్నప్పుడు ఆదుకునేది. దాంతో అడవిలోనున్న చిన్న చిన్న జంతువులంతా సంబరంగా పులి చుట్టూ తిరుగుతా, మాటలు కలుపుతా, తమను ఏవయినా చంపాలనుకుంటే ఆ విషయం చెబుతా వుండేవి.
ఒకరోజు పులికి ఆకలి అయితా వుంటే వేటకు బైలుదేరింది. పొద్దున్నుంచీ ఏవీ ఎదురుపడలేదు. ఏమబ్బా... ఈ రోజు ఒక్కటీ కనబడ్డం లేదు. అడవిలోని నక్కలూ, తోడేళ్ళు ఏమైపోయినాయి అనుకుంటా పోతా వుంటే దానికి ఎదురుగా ఒక ఆవు కనబడింది. పులి అంతవరకు ఎప్పుడూ ఆవును చూడలేదు. అసలు ఆ అడవిలో ఆవులు ఎక్కడా లేవు. దాంతో ''ఇది చూడడానికి పెద్దగా బలంగా వుంది. రెండు కొమ్ములు వున్నాయి. కానీ మొగం చాలా అమాయకంగా వుంది. ఇది మంచిదా, చెడ్డదా... దీనిని చంపాలా వద్దా'' అని ఆలోచించసాగింది.
అంతలో ఆవు పులిని చూసింది. చారలు చారలుతో, కోరపళ్ళతో, చాలా పెద్దగా, గంభీరంగా వుంది. ఇదేం జంతువబ్బా అనుకుంటా చిరునవ్వుతో దగ్గరికి పోయి ''నా పేరు ఆవు. అడవి నాకు కొత్త. మనుషులతో కలసి వుంటాను. శాకాహార జంతువును. గడ్డి, ఆకులు, పళ్ళు తింటా వుంటాను. నువ్వు ఎవరు'' అనింది. పులికి ఆవు అమాయకురాలని తెలిసిపోయింది. దాంతో ''నా పేరు పులి. అడవి జంతువును. నేనంటే అడవిలో అందరికీ భయం. మాంసాహారం తిని బతుకుతాను'' అనింది. ఆ మాటలకు ఆవు బెదిరిపోయింది. పోయి పోయి దీని నోటికి చిక్కినట్టున్నానే అనుకోని పారిపోవడానికి వెనక్కి తిరిగింది. అంతలో పులి ''ఆగు తల్లీ... నేను మిగతా పులుల లెక్క కాదు. చెడ్డ జంతువులనే వేటాడతాను కానీ నీలాంటి అమాయకులను కాదు. ఏమీ భయపడవద్దు. ఇంతకూ నువ్వెందుకు ఇలా మా అడవిలోనికి వచ్చినావు'' అనింది.
ఆవు బాధతో తల వంచుకోని ''ఈ అడవికి ఉత్తరం వైపున వున్నదే మా వూరు. మా యజమాని రోజూ మా ఆవులనంతా అడవి బైట వున్న పెద్ద పచ్చని మైదానానికి మేత మేయడానికి తోలుకోని పోతాడు. రోజూ అక్కడ మేం కడుపు నిండా తిని సాయంకాలం తిరిగి వెళ్ళిపోతాము. పొరపాటున గూడా ఎవరమూ అడవిలోకి అడుగు పెట్టము. నాకు ఒక చిన్న దూడ వుంది. ఆరునెలల అమాయకురాలు. ముచ్చటగా ముద్దుపెట్టుకునేలా వుంటాది. అది ఆడుకుంటా ఆడుకుంటా పొరపాటున అడవిలోనికి వెళ్ళిపోయింది. నేను అది గమనించలేదు. సాయంకాలం అన్ని ఆవులూ, వాటి దూడలు వచ్చేసినాయి గానీ నాది రాలేదు. దాంతో నా దూడను వెదుక్కుంటా ఇక్కడికి వచ్చినాను'' అనింది. దాని కళ్ళలోంచి నీళ్ళ చుక్కలు కారి టపటపా కింద వున్న గడ్డి మీద పడినాయి.
ఆ మాటలకు పులి ''వింటా వుంటే నాకే ఇంత బాధగా వుంటే కన్నతల్లివి నీకెంత బాధగా వుంటాదో గదా... అమ్మా... పరవాలేదు ఇంకా నీ దూడ బతికే వుంటే నేను తప్పక కాపాడతాను. ఈ అడవిలో ఎక్కడ ఏ పొద వుందో, ఏ పొదలో ఏ జంతువు వుందో, ఏ జంతువు గుణం ఎలాంటిదో, ఎప్పుడు ఎక్కడ తిరుగుతాదో అన్నీ నాకు తెలుసు. ముందు నీ దూడ ఎక్కడ తప్పిపోయిందో చూపించు. నేను వాసన పసిగట్టి అది అడవిలో ఎటువైపు ఎక్కడికి పోయిందో కనుక్కోని తెచ్చి నీ చేతిలో పెడతా'' అనింది.
రెండు వేగంగా ఆవులు మేత మేసే మైదానానికి చేరుకున్నాయి. పులి అక్కడంతా వాసన చూసుకుంటా ముందుకు పోతా అడవిలోనికి వచ్చింది. దానికి ఒకవైపు దూడ వాసన వచ్చింది. 'నేను తిరిగి వచ్చేవరకు నీవు ఇక్కడే వుండు. బతికుంటే ఖచ్చితంగా మీ ఇద్దరినీ కలుపుతా' అంటా వెంటనే ఆ వాసన వెంబడి వేగంగా పరుగులు తీసింది. ఆ దారి అడవి నక్కలు బాగా తిరిగేచోటు. 'ఏ నక్క నోటికో అది చిక్కలేదు గదా అని భయపడసాగింది.
అంతలో దానికి దూరంగా ''అంబా'' అన్న అరుపు చిన్నగా, దీనంగా వినబడింది. పులి అదిరిపడి అది ఏదో ఆపదలో వుందనుకుంటా విల్లు నుంచి వెలువడిన బాణంలా మెరుపు వేగంతో అటువైపు దూసుకొని పోయింది. అక్కడ ఒక పెద్ద తోడేలు ఎదుట బిక్కు బిక్కుమంటా బెదురు చూపులతో వణికిపోతా వున్న దూడ కనిపించింది. ఆ తోడేలు చానా చెడ్డది. కనబడిన జంతువునల్లా చంపి సంబరపడేది. చిన్న చిన్న జంతువులన్నీ దాని పేరు చెబితే చాలు భయంతో వణికిపోయేవి. పులి దాని కోసం చానా రోజుల నుంచి వెదుకులాడతా వుంది. ఇప్పుడు కనబడింది. అంతే... పులి సంబరంగా ''ఈ దెబ్బతో నా ఆకలీ తీరుతుంది. అడవికి పట్టిన శనీ వదులుతుంది. చిన్నదూడ తల్లి వద్దకు చేరుతుంది'' అనుకుంటా ఎగిరి పంజాతో దాన్ని ఒకే ఒక్క పెరుకు పెరికింది. అంతే... ఆ దెబ్బకు అది ఎగిరిపడింది.
పులి ఆ చిన్నదూడను తీసుకొని దాని అమ్మ దగ్గరికి చేరింది. ఆవు సంతోషంగా దూడను కౌగిలించుకొనింది. పులి దగ్గరికి పోయి కళ్ళనీళ్ళతో ''నీ మేలు ఎప్పటికీ మరిచిపోలేను. నీవు కనబడకపోతే నా పిల్ల ఎప్పటికీ నా దగ్గరికి చేరేది కాదు. నువ్వే నాకు దేవునివి'' అనింది. పులి చిరునవ్వుతో దూడవైపు తిరిగి ''పాపా... ఇంగెప్పుడూ ఇలా అడవిలోకి రాకు. అమ్మ మాట వింటా అమ్మ వెంబడే తిరుగు. సరేనా'' అంటూ సంతోషంగా తిరిగి అడవిలోనికి వెళ్ళిపోయింది.
***********
కామెంట్‌లు