ఒక వెంట్రుక రాణి కథ ;-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒకూర్లో ఒక రాజుండేటోడు. ఆయనకు ఇద్దరు పెండ్లాలు. మొదటి పెండ్లానికేమో ఒక వెంట్రుక... రెండో పెండ్లానికేమో రెండు వెంట్రుకలు వున్నాయి. రెండో పెండ్లానికి రెండు వెంట్రుకలు వున్నాయి గదా... అందుకని రెండో దానికి భలే టెక్కు. ఒకరోజు మొగునితో “బావా... బావా... నాకు అక్క కన్నా ఒక వెంట్రుక ఎక్కువుంది గదా... ఆమెను ఇంట్లో నుండి గెంటేయి. ఉంటే అదన్నా ఉండాలి. లేదా నేనన్నా ఉండాల" అంటూ గొడవ పెట్టుకుంది. ఆమె బాధ భరించలేక రాజు మొదటి పెండ్లాన్ని "నెత్తి నిండా వెంట్రుకలు వచ్చేదాకా ఇంట్లోకి రావొద్దు అంటూ" ఆమెను పొమ్మన్నాడు 
ఆమె ఏడ్చుకుంటా... ఏడ్చుకుంటా... అడవిలో పోతావుంటే దారిలో ఒక చీమలపుట్ట కనబడింది. చీమలు ఆమెని చూడగానే “అమా... అమా... కొంచం మా పుట్టను బాగు చేసి చక్కెర పోసి పోమ్మా... నీకు పుణ్యముంటాది" అని బ్రతిమలాడినాయి. ఆమె చానా మంచిది గదా... దాంతో సరేనని పుట్టంతా బాగు చేసి చీమలకు చక్కెర పోసి పోయింది.
మళ్ళా ఆమె పోతావుంటే దారిలో ఒక ఎండిపోతున్న మల్లె చెట్లు కనబడి "అమా.. అమా... నీళ్ళు లేక ఎండిపోతా వున్నాను. దయచేసి కొంచం నీళ్ళు పోసి పోమ్మా... నీకు పుణ్యముంటాది" అనడిగింది. ఆమె సరేనని దగ్గరలో వున్న ఒక చెరువుకాడికి పోయి నీళ్ళు తెచ్చి దానికి పోసింది.
మళ్ళా ఆమె పోతావుంటే దారిలో ఒక గుర్రం కుంటుకుంటా... కుంటుకుంటా... ఎదురొచ్చి “అమా.... అమా... నా కాలిలో ముల్లిరిగింది. కొంచం తీసిపోమ్మా... నీకు పుణ్యముంటాది" అనడిగింది. ఆమె సరేనని దాని కాలు ఒళ్ళో పెట్టుకోని నెమ్మదిగా నొప్పి తెలీకుండా ముల్లు బయటికి తీసింది.
మళ్ళా ఆమె పోతావుంటే దారిలో ఒక గుడిసె కనబడింది. గుడిసెలో ఎవరున్నారబ్బా అని లోపలికి తొంగి చూస్తే ఒక ముసలవ్వ కనబడింది. అవ్వ ఆమెని చూడగానే "అమా... అమా... ముసలిదాన్ని... ఏ పనీ చేసుకోలేను. చానా ఆకలిగా వుంది. కొంచం అన్నం వండి పెట్టి పోమ్మా" అనడిగింది. ఆమె సరేనని అన్నం వండి అవ్వకి పెట్టింది.
అవ్వ అన్నం తింటావుంటే "అవా... అవా... నెత్తి మీద నిండుగా వెంట్రుకలు రావాలంటే ఏం చేయాల" అనడిగింది. దానికా అవ్వ కాసేపు ఆలోచించి "ఈడికి దగ్గర్లోనే ఉప్పు సముద్రం, పాల సముద్రం వున్నాయి. ముందు ఉప్పు సముద్రంలో మునిగి ఆ తరువాత పాల సముద్రంలో మునుగు" అని చెప్పింది.
ఆమె అలాగేనని కొంతదూరం పోయేసరికి రెండు సముద్రాలూ పక్కపక్కనే కనబన్నాయి. అవ్వ చెప్పినట్లే ముందు ఉప్పు సముద్రంలో మునిగింది. అంతే వున్న ఒక్క వెంట్రుక కూడా వూడిపోయింది. మళ్ళా పోయి
పాల సముద్రంలో మునిగింది. వెంటనే నెత్తి నిండా నిగనిగలాడతా నల్లని వెంట్రుకలు చూడముచ్చటగా వచ్చేసినాయి.
ఆమె సంబరంగా తిరిగి అవ్వ దగ్గరికి వచ్చింది. అవ్వ ఆమెను చాప మీద కూచోబెట్టి “నీకు సద్దన్నం కావాల్నా... వేడన్నం కావాల్నా" అనడిగింది. ఆమె సద్దన్నమే పెట్టమనింది. అవ్వ నవ్వి వేడివేడి అన్నం, పప్పు పెట్టింది. ఆమె అన్నం తిని ఇక నేను పోయెస్తానని చెప్పి పోతావుంటే అవ్వ “ఒక్క నిమిషం ఆగమ్మా" అని "నీకు పాత చీర కావాల్నా... కొత్త చీర కావాల్నా" అనడిగింది. ఆమె కొత్త చీర నువ్వే కట్టుకో. పాతది చాలు అనింది. అవ్వ ఇంట్లోకి పోయి కొత్త చీర, కొత్త నగలు తెచ్చిచ్చింది. ఆమె ఆ కొత్త చీర కట్టుకోని... కొత్త నగలు వేసుకోని ఇంటికి బైలుదేరింది.
అడవిలో నడుస్తా వుంటే దారిలో గుర్రం ఎదురొచ్చి "అమా... అమా... నా కాలులోని ముల్లు తీసి నా బాధను పోగొట్టినావు. నా మీదకు ఎక్కు నిన్ను యాడికి కావాలంటే ఆడికి తీసుకోని పోతాను" అనింది. ఆమె సరేనని గుర్రమెక్కింది.
గుర్రం మీద ఇంటికి పోతావుంటే దారిలో మల్లెపూల చెట్టు కనబడి “అమా... అమా... నీవు నీళ్ళు పోసి నన్ను బతికించినావు. నా పూలు తీసుకో" అనింది. ఆమె జడ నిండా పూలు పెట్టుకోని పోతావుంటే చీమలపుట్ట కనబడింది. ఆమెను చూసి చీమలన్నీ బయటకు వచ్చి "నువ్వు చల్లగా పిల్లా పాపలతో నూరేండ్లు బతకాల" అని దీవించినాయి.
రాజు నల్లని వెంట్రుకలతో జడ నిండా పూలు పెట్టుకోని కొత్తచీర... కొత్త నగలతో... కొత్త పెళ్ళి కుతురులా గుర్రమ్మీదొచ్చిన మొదటి పెండ్లాన్ని చూసి సంబరపడి ఆమెను ఇంట్లోకి పిలుచుకోనిపోయి రెండో పెండ్లాన్ని “పో... పోయి... నువ్వు గూడా ఇట్లాగే తయారై రాపో" అని బైటకి గెంటేసినాడు.
ఆమె కోపంతో చిందులు తొక్కుకుంటూ... అడవిలో పోతావుంటే దారిలో ఒక చీమలపుట్ట కనబడింది. చీమలు ఆమెని చూడగానే “అమా... అమా... కొంచం మా పుట్టను బాగు చేసి చక్కెర పోసి పోమ్మా... నీకు పుణ్యముంటాది" అని బతిమలాడినాయి. దానికామె కోపంగా “నా మొగుడు నన్ను బైటకు దొబ్బేసినాడని నేనేడుస్తా వుంటే మధ్యలో మీకు చక్కెర పోయాల్నా... వుండు మీ పని చెప్తా" అంటూ పుట్టనంతా కాళ్ళతో చిందరవందర చేసేసింది..
మళ్ళా ఆమె పోతావుంటే దారిలో ఒక ఎండిపోతావున్న మల్లె చెట్టు కనబడి "అమా... అమా... నీళ్ళు లేక ఎండిపోతా వున్నా... దయచేసి కొంచం నీళ్ళు పోసి పోమ్మా... నీకు పుణ్యముంటాది" అనడిగింది. దానికామె "నాకు వెంట్రుకలు లేక నేనేడుస్తా వుంటే... మధ్యలో నీకు నీళ్ళు కావాల్నా... వుండు నీ పని చెప్తా" అంటూ చెట్టు కొమ్మలన్నీ ఇష్టమొచ్చినట్టుగా తుంచి పాడేసింది.
మళ్ళా పోతావుంటే దారిలో ఒక గుర్రం కుంటుకుంటా... కుంటుకుంటా... ఎదురొచ్చి “అమా... అమా... నా కాలిలో ముల్లిరిగింది. కొంచం తీసిపోమ్మా... నీకు పుణ్యముంటాది" అనడిగింది. దానికామె కోపంగా "నేనెవరనుకుంటా వున్నావు. రాజు పెండ్లాన్ని. నేను నీ కాళ్ళు పట్టుకోవాల్నా... పోతావా లేదా ఈన్నించి" అంటూ కట్టె తీసుకోని దాన్ని కొట్టింది.
మళ్ళా ఆమె పోతావుంటే దారిలో ఒక గుడిసె కనబడింది. గుడిసెలో ఎవరున్నారబ్బా... అని తొంగి చూస్తే లోపల ఒక ముసలవ్వ కనబడింది. అవ్వ ఆమెను చూస్తానే “అమా... అమా... ముసలిదాన్ని. చానా ఆకలిగా వుంది. కొంచం అన్నం వండి పెట్టి పోమ్మా. నీకు పుణ్యముంటాది" అనింది. దానికామె కోపంగా "నేనేమైనా నీ దాసీననుకుంటా వున్నావా... సేవలు చేయడానికి... అన్నం
లేదు గిన్నం లేదు" అని కసురుకోని “నాకు వెంట్రుకలు
రావాలంటే ఏం చేయాల్నో మర్యాదగా చెప్పు" అని గద్దించి అడిగింది.
దానికా అవ్వ "ఇక్కడికి దగ్గర్లోనే ఉప్పుసముద్రం, పాలసముద్రం ఉన్నాయి. ముందు ఉప్పుసముద్రంలో మునిగి
ఆ తర్వాత పాలసముద్రంలో మునుగు" అని చెప్పింది. ఆమె కొంచెం దూరం పోయేసరికి రెండు సముద్రాలు కనబన్నాయి. కానీ అవ్వ చెప్పినట్టు కాకుండా ముందు పాల సముద్రంలో మునిగింది. వెంట్రుకలన్నీ నిండుగా వచ్చినాయి. ఇంకా అంతకు రెండింతలు రావాలి అనుకొని ఆ తరువాత పోయి ఉప్పు సముద్రంలో మునిగింది. అంతే... వచ్చినవన్నీ వూడిపోయి నున్నగా గుండైంది. తర్వాత ఆమె ఎన్ని సార్లు ఏ సముద్రంలో మునిగినా ఒక్కటంటే ఒక్క వెంట్రుక గూడా రాలేదు.
ఆమె తిరిగి పోతావుంటే అవ్వ కనబడి ఆమెని పిల్చి “నీకు సద్దన్నం కావాల్నా... వేడన్నం కావాల్నా" అనడిగింది. ఆమె వేడివేడి అన్నం కావాలనింది. దాంతో అవ్వ ఆమెకు సద్దన్నం... సద్దిపప్పు పెట్టింది. అన్నం తిని పోయిస్తానని అవ్వకు చెప్పకుండానే పోతావుంటే అవ్వ “ఒక్క నిమిషం ఆగమ్మా..." అని "నీకు పాత చీర కావాల్నా... కొత్త చీర కావాల్నా" అనడిగింది. ఆమె "పాత చీరలు నాకెందుకు. నువ్వే కట్టుకొని కొత్తచీర ఇవ్వు" అనింది. అవ్వ ఇంట్లోకి పోయి పాత చీర, పాత నగలు తెచ్చిచ్చింది. ఆమె పాత చీర కట్టుకోని... పాత నగలు వేసుకోని... ఇంటికి బైలుదేరింది.
పోతావుంటే దారిలో గుర్రం ఎదురొచ్చింది. ఆమె దాన్ని చూసి "నడిచీ... నడిచీ... కాళ్ళు నొప్పి పెడతా వున్నాయి. కాస్త నన్నెక్కిచ్చుకోని పోవా" అనడిగింది. దానికి గుర్రం “నా కాల్లో ముల్లు గుచ్చుకోని నేనేడుస్తా వుంటే... నువ్వేమయినా తీసినావా... నిన్నెక్కించుకోడానికి... ఫో... ఫో..." అని కసురుకోనింది.
మళ్ళా ఆమె పోతావుంటే దారిలో మల్లెపూల చెట్టు కనబడింది. ఆమె దాన్ని “నాకు కొన్ని పూలియ్యవా" అనడిగింది. దానికా మల్లె చెట్టు "నాకు నీళ్ళు పొయ్యమంటే పొయ్యలేదు గదా... మరి నేనెందుకు పూలియ్యాల... ఫో... ఫో..." అని కసురుకోనింది.
ఆమె మళ్ళా పోతావుంటే దారిలో చీమలపుట్ట కనబడింది. ఆమె పుట్ట దగ్గరికి పోయి "చీమల్లారా... నన్ను దీవించండి" అనడిగింది. కానీ, ఆ చీమలు "నువ్వు మా పుట్ట బాగు చేసి... చక్కెర పోసి పొమ్మంటే... పొయ్యలేదు గదా.... మరి మేమెందుకు నిన్ను దీవించాల... దీవించం ఫో" అని కసురుకున్నాయి.
చినిగిపోయిన పాత చీరతో... గుండుతో... ఏడుస్తా ఇంటికొచ్చిన పెండ్లాన్ని చూసి రాజు అసహ్యించుకోని “ఫో... దరిద్రందానా" అని మళ్ళా బైటకు దొబ్బేసినాడు. ఇది చూసిన మొదటి పెండ్లాం పరుగు పరుగున అక్కడి కొచ్చి "ఎన్ని తప్పులు చేసినా ఆమె నాకు చెల్లెలే. మా చెల్లిని రానీయండి" అని బతిమలాడింది. రాజు మొదటి పెండ్లాం మంచితనాన్ని మెచ్చుకోని ఆమెను ఏడంతస్తుల మేడలో పెట్టి, రెండో పెండ్లాన్ని పశువుల కొట్టంలో పెట్టినాడు.
**********
కామెంట్‌లు