"లోకోత్తర రామాయణం";- గంగాపురం శ్రీనివాస్- 9676305949
(శ్రీ రామ నవమి సందర్భంగా కవిత)
°°°°°°°°°°°°°°°°°°°°°°°

అమాయకపు
సీతలున్నంత కాలం
లక్ష్మణ రేఖ గీసినా,
మాయాలేడి ప్రలోభాలకు
సులభంగానే బోల్తాపడుతారు 

భయపెట్టే
రావణాసురులున్నంతకాలం 
వెర్రిబాగుల జనం
భజన బాజా చేస్తూ
తోకలూపుతూనే ఉంటారు 

స్వార్ధపు
మందరలున్నంతకాలం
సంసార సాగరంలో
మోసపు గరళం
చిలుకుతూనే ఉంటారు

మోహపు
శూర్పణఖలున్నంతకాలం
ద్వేషపు జ్వాలలు
పొద్దస్తమానం
రగులుతూనే ఉంటయి

గర్వపు
వాలిలున్నంతకాలం
నిస్సహాయ సుగ్రీవులు
కిష్కింద కొండల్లో
సాయపు పొద్దుకొరకు
ఎదురు చూస్తూనే ఉంటరు

పగోడీ  ఇళ్లల్లో
ప్రజాస్వామ్య విభీషణుడుంటే
పాలోళ్ళ ఇళ్ళల్లో కూడా
మురిపాల పాలు పొంగుతాయి 

అంగదుడి లాంటి అంగబలం,
హనుమ లాంటి సేవాగుణం,
లక్ష్మణుడి లాంటి మంత్రాంగం,
జగదబిరాముడి లాంటి
సకల సద్గుణాల రాజుంటే
రాజ్యంలో లోక కళ్యాణం
అలుగులు దూకుతుంది.


       

కామెంట్‌లు