మాతా నాస్తి, పితా నాస్తి...;- "కవిమిత్ర" శంకర ప్రియ.,-సంచార వాణి:- 99127 67098
 తల్లి తండ్రి బంధువులు
ధనం గృహం.. అనునవి
     భ్రాంతి నొసంగు మనకు
మేల్కొనండి! బుధులార!
     ( అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,) 

👌ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే; మనలను పెంచి పెద్దజేసిన.. తల్లిదండ్రులు, బంధువులు, అన్నదమ్ములు; అదే విధంగా... మనము సంపాదించిన డబ్బు, ఇల్లు... మున్నగునవి, మిధ్య వంటివి. అనగా, భ్రాంతిని కలిగించునవి! ఇవన్నియు నిజముగా లేవు. కావున, సాధకులార! మీరు సావధానులై ఉండండి! అని, మన మహర్షుల యొక్క దివ్య సందేశము!
⚜️మాతా నాస్తి, పితా నాస్తి 
      నాస్తి బంధు సహోదరః!
      అర్థం నాస్తి, గృహం నాస్తి
      తస్మాత్ జాగ్రత! జాగ్రత!!

                🚩తేట గీతి 
     తల్లి దండ్రులు చుట్టాలు ధరణి పైన
      అన్నదమ్ములు గృహములు అర్థ కోటి
      అన్ని మిథ్యయే యనియెంచి  అనవరతము
     జాగరూకులై ఉండుడీ జనులెఱింగి!

       ( డా. శాస్త్రుల రఘుపతి.,)
   *****************************
                🚩తేట గీతి 
    తల్లిదండ్రులు, బంధులు, ధనము, గృహము, 
    సోదరులు, మిత్ర కోటియు, సుందరులును,
    నిజమునకు లేవు తలపగ, నిత్యమైన
    దొక్క బ్రహ్మమే, జాగ్రత్త  నిక్కవమిది!

      ( "కవికల్పభూజ"  చింతా రామకృష్ణారావు.,)
కామెంట్‌లు