పరోపకారం చేయాలి;- కవిమిత్ర, శంకర ప్రియ., శీల ,-సంచార వాణి:- 99127 67098
 👌 విత్తము నందు దానము
 సద్వాక్కు నందు సత్యము
      కల్గియుండాలి మనము!
  ఓ ఆత్మబంధువు లార!
               🪷(2)
     పంచ భూతాత్మక మైన
 ఈ దేహముతో నెప్పుడు
     పరోపకారం చేయాలి!
  ఓ ఆత్మ బంధువు లార!
             (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
  👌"జీవసేవ యే శివసేవ!" అనే ఆర్యోక్తి అనుసరించి;  సమస్త ప్రాణికోటిని  పరమశివుని స్వరూపులుగా భావించి; భక్తిప్రపత్తులతో సేవించాలి! ప్రతిఫలమును ఆశించకుండా, జీవులందరి హితమును ఆకాంక్షించాలి!  ఎట్లనగా ఫలవృక్షములు, నదీజలములు.. మున్నగు వాటివోలె, యథాశక్తిగా పరోపకారం చేయాలి, మనమంతా!
   👌 ధనము నుండి... దానగుణమును; వాక్కు నుండి...  సత్య లక్షణమును; ఆయుష్షు నుండి... కీర్తి ధర్మములను; పాంచ భౌతిక మైన దేహము నుండి... పరోపకారమును ఆచరించ వలెను; అట్లే, అశాశ్వతమైన ధనము, ఆయుష్యము, శరీరము... మున్నగునవి, అసారమైనవి. వాటి నుండి సారవంతమైన వాటిని గ్రహించవలెను! అని, సుభాషితము (మంచి మాట) వివరించు చున్నది!        
💚 దానం విత్తాదృతం వాచః
 కీర్తిధర్మౌ తథాయుషః! 
     పరోపకరణం కాయాత్
అసారాత్ సార మహరేత్!
        (సుభాషిత రత్నావళి.,)
🚩 తేట గీతి పద్యం:-
       దానమును గ్రహింప నగును, ధనము నుండి
      సత్యముండును, సుమతి సద్వాక్కు నందు;
     కీర్తి ధర్మము లాయుష్య వర్తనములు
     తనువిది పరహిత వరసాధనము కనగ!
         [డా. శాస్త్రుల రఘుపతి.,]
         *************
 🚩తేట గీతి పద్యం:- 
     ధనము నుండియు దానంబు, తగిన వాక్కు 
     నుండి సత్యము, నాయువు నుండి కీర్తి 
     ధర్మముల, నుపకారము తనువు నుండి,
     సారమును గ్రహించ వలె, నసారమునను.
      [విద్వాన్ పూడి హరనాథ రావు.,]
కామెంట్‌లు