మంత్రపుష్పం;- :డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
ఉసురు తప్పక ముట్టి
ఊడ్చుకు పోయారు.

ఊసరవెల్లి వేషాలు బెడిసి
ఊచలు లెక్కపెడుతున్నారు.

ఊకదంపుడు మాటలు విని,విని
కర్రుగాల్చి వాతలు పెట్టినారు.
సర్రున కాళ్ళ కింది తివాచీ
ఒడుపుగా లాగివేసినారు.

రాజభవనాల రాజసాలు
రాజనాల ఒరల కత్తులై
కిరీటాలను ఒక్కదెబ్బతో
పొలిమేరలకు ఎగురగొట్టినారు.

టక్కుటమార,గజకర్ణ,గోకర్ణ
విద్యలన్నింటిని మూటగట్టి
మూసీ వెలుపల ముంచేసినారు.

లెక్కబెట్టనన్న వారు కడుపుకాలి,నివురుగప్పిన నిప్పులోలె అదును చూసి
ఉవ్వెత్తున ఎగిసి మసి చేసినారు.

నీళ్ళలోని చేపలన్నీ ఈదులాట వదిలి వెతుకులాటతో సరిపెట్ట,
ఒడ్డుకు తాకిన అలల వల బడి
గులకరాళ్ళన్నీ నీట మునిగాయి.

అందని ద్రాక్షలకర్రులు జాచిన
గుంటనక్కలన్నీ గూబలు
గుబేలుమనగా,
వెర్రిచూపులు చూస్తూ ఊళలేస్తున్నాయి.

కసుగాయలు పంటికింద బడినట్లు,
వడగళ్ళ వానలో పంట నాశనమైనట్లు
అధికారమును పెద్దపాము మింగినట్లు,
వైకుంఠపాళి ఆట రక్తి కట్టింది.

పథకాల పరాచాకలన్నీ
పగలబడి నవ్వుతూ,
పళ్ళూడగొట్టినాయి.
చేసిన కర్మలన్నీ తిరిగి మళ్ళీ
అక్కడికే చేరుతున్నాయి.

డబ్బుల మాయలన్నీ
డప్పు చప్పుళ్ళతో మారుమోగుతున్నాయి.
దండోరాలు పూలమాలలై
మెడ చుట్టుకుంటున్నాయి.

శాశ్వతం కాదన్న భ్రమలన్నీ తొలగి,
కళ్ళ మబ్బులన్నీ ప్రక్షాళన 
కాబడుతున్నాయి.

దాహమంతా దహించుకుపోయి
కాళ్ళ కింద నేల స్పష్టమవుతున్నది.
కాదేదీ అనర్హమన్న మాట
కళ్ళెదుట సాక్ష్యంగా నిలబడుతున్నది.

కామెంట్‌లు