శ్రీరామచంద్రుడు (పద్యములు );- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 సీసం :
దశరథ తనయుడు దానవ సంహారి 
రామచంద్రుని మించు రాజు కలడె?
శివధనుస్సును ద్రుంచి సీతను పెండ్లాడి 
వీరత్వమును జూపు వేల్పు కలడె?
జలధిపై వారధి చకచకా కట్టించి 
మహిలోన నిల్చిన మనిషి కలడె?
కలికి సీతను వీడి కానల కంపించి 
ప్రభుత నడిపినట్టి ప్రభువు కలడె?/
తేటగీతి.
ధర్మగతిలోన నిత్యము తరలు చుండి 
భువన మంతయు నేలిన పుణ్యమూర్తి 
రామచంద్రుడు ధరణిని రక్షసేయు 
కూర్మి మీరగా స్వామిని కొల్వ రండి!/
తేటగీతి.
తండ్రి రామయ్య రూపము తలచినంత 
పర్వతంబుల బోలెడి పాపరాశి 
భస్మమైపోవ కల్గు సౌభాగ్యసిరులు 
భక్తజనులకు లభియించు ముక్తి ఫలము.//

కామెంట్‌లు