సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -486
గుడ జిహ్వికా న్యాయము
*****
గుడ అనగా బెల్లము, ఏనుగు, కవచము,కబళము,పొగడ చెట్టు.జిహ్వికా అనగా నాలుకపై అని అర్థము.
బెల్లము నాలుకపై ఉన్నంత సేపే తీపి అని అర్థము.
 నోట్లో బెల్లం ముక్క ఉన్నంత వరకే నోరంతా తీయగా ఉంటుంది. ఆ తర్వాత నోరూ మామూలే. మనమూ మామూలే.అది అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఈ న్యాయమును తరిచి చూస్తే,లోలోపల వెతికి చూస్తే చాలా అర్థాలు బోధ పడతాయి.
నోట్లో బెల్లం ఉన్నంత వరకే అంటే అర్థం మన నోరు మాట్లాడే మాటలు నొప్పించకుండా తీయగా ఉన్నంత వరకే  ఎదుటి వారి నుండి గౌరవం, అభిమానం లభిస్తాయి. ఏ మాత్రం తేడా వచ్చినా అది ఎదుటి వారి నుండి  నిరసనలు ,అసహనాలు వెల్లువెత్తుతాయి.అందుకే మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు.ఈ న్యాయములో  ఇదో కోణం.
 ఇక మరో కోణంలో చూస్తే... కొందరు ఎప్పుడూ తమ గురించి తీయ తీయగా చెప్పే అబద్ధాలను ఎంతో ఇష్టంగా వింటారు.ఇలా కాదు అలా అని హితవు చెప్పబోతే, వారిని సరిదిద్దే ప్రయత్నం చేస్తే మాత్రం ఇష్టపడరు.అప్పటి వరకు తీయటి పొగడ్తలకు అలవాటు పడిన వ్యక్తులకు  చేదు వాస్తవాలను ఒప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
ఇక్కడ నోట్లో బెల్లం ముక్క ఉన్నంత వరకే అనే దానిని మరో రెండు రకాలుగా కూడా వర్తింపజేసుకోవచ్చు. అదెలా అంటే ఒకటి  మహా భాగ్యం లాంటి ఆరోగ్యం. అది బాగున్నంత వరకే  ఏదైనా సాధ్యమే. అది ఎప్పుడైతే మనిషి నుండి దూరమైపోతుందో అప్పటి నుండి ఆ వ్యక్తికే కాదు, ఆ వ్యక్తికి   సేవలు చేసే వారికీ, చూసే వారికి విసుగు,అసహనం,బాధ మొదలైనవి ప్రారంభం అవుతాయి.
ఇక బెల్లం లాంటి సంపద. బెల్లం ఉంటే చుట్టూ ఈగలు ముసిరినట్టు బంధువులు స్నేహితులు మొదలైన వారు చుట్టూ సంపద ఉన్న వారి చుట్టూ ముసురుతారు.అందుకే సుమతీ శతక కర్త ఇలా అంటాడు.
"ఎప్పుడు సంపద కలిగిన/ నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్/ దెప్పలుగ జెరువు నిండిన/ గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!"
ఓ బుద్ధిమంతుడా! ఎలా అయితే చెరువు నిండా నీళ్ళు ఉన్నప్పుడు కప్పలన్నీ వచ్చి అక్కడ చేరుతాయో,అదే విధంగా నీ దగ్గర డబ్బు ఉన్నన్ని రోజులు బంధువులు నీ చుట్టే వుంటారు. అది లేని రోజున ఎవరూ నీ దగ్గరకు రావడానికి ఇష్టపడరు అని అర్థము.
 ఇవన్నీ చదువుతుంటే మనకు అర్థమైపోయింది కదా! నోట్లో బెల్లం ముక్క అనేది కేవలం రుచిగా  నోట్లో వేసుకుని చప్పరించేది కాదు. అలా చెప్పడం ఒక ఉదాహరణ మాత్రమే.దానిని ప్రతీకగా తీసుకుని దానిని "తీయని మంచి మాటతోనూ ఆరోగ్యంతోనూ,సంపదతోనూ పోల్చి చెప్పడమనేది ముఖ్యం అన్నమాట.
 కాబట్టి పెద్దలు  ఏ న్యాయము చెప్పినా ఊరికే చెప్పరు.తరచి చూస్తే తప్పకుండా అందులోని అంతరార్థం ఏమిటో బోధపడుతుంది.
మాటైనా,చేతైనా చివరికి ఆరోగ్య రాతైనా పై వాటి మీదే ఆధారపడి ఉంటుందని  ఈ "గుడ జిహ్వికా న్యాయము" ద్వారా మనం తెలుసుకోగలిగాం.
కాబట్టి సమాజంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బతకాలంటే మంచి నోరు, కావలసిన సంపద, వాటిని అనుభవించ గలిగిన ఆరోగ్యం  తప్పకుండా ఉండాలి.అవి ఉన్నంత సేపే  మనమూ మన జీవితం,గౌరవ మర్యాదలు మొదలైనవీ.ఇవి అర్థం చేసుకుని ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామా మరి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు