సుప్రభాత కవిత ; - బృంద
అంత తొందరెందుకు?
ఎవరిని కలవాలి?
అసలాగవెందుకూ??
అలుపే లేదా నీకు?

అమ్మ ఒడిని సేద దీరే
అందమైన కాలం
గుర్తుకే రానంత 
కొంత సమయమేనా??

అన్నీ అద్భుతాలే
అనిపించే ....
అన్నీ నాకోసమే
అనిపించే బాల్యం
చూస్తూ చూస్తూ
కనుమరుగు చేసావ్!

బోలెడంత బరువు
భుజాన వేసి ముందుకు తోసి
క్షణమాగని పరుగులు
తీయించి పదారు తెచ్చేసావ్!

కలలు ఒకటీ పూర్తిగా కనకనే
కనులు తెరిచేలోగా
కమ్మని బంధాలు ముడివేసి
మాయలో పూర్తిగా దింపేసావ్!

సాగరాన నీటివాలున
సాగిపోయే నావలో
తీరమేదో దూరమెంతో
తెలుసుకునే వీలే లేకుండా చేసావ్!

కర్తవ్యపు గొలుసులతో
కట్టివేసి మనసు మూసి
తెరలువేసి తెరిపిలేక
ఉక్కిరి బిక్కిరి చేసావ్!

ఎవరికోసమూ ఆగవేం?
కుదురుగా కాసేపు ఉండవే!?
ఎందుకంత నిర్లక్ష్యం?
ఏమిటంత కాఠిన్యం?

మంచి చెడులకు అతీతంగా
పాప పుణ్యాలకు సాక్షిగా
న్యాయాన్యాయాలు తెలిసినా
మార్గం చూపని మౌనంగా

ఎంతకాలం ఈ వివక్ష
జనులకీవా నీ రక్ష???
ఆరని ఆశల తెడ్డులిచ్చి
నడుపుకోమని మాకు పరీక్షా?

కరిగిపోయే కాలమా
తిరిగి చూడవెందుకమ్మా?
వేచి ఉన్న కనుల ముందు
వేడుకగా వెలుగులు నింపవా

వేకువమ్మా

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు