శ్రీరామ నవమి విశిష్టత;- సి.హెచ్.ప్రతాప్
 శ్లో:
లోకాభిరామం రంరంగదీరం
రాజీవనేత్రం రఘువంశనాథమ్
కారుణ్యరూపం కరుణాకరం శ్రీ
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే
చైత్ర శుక్ల నవమి శ్రీరామనవమి. శ్రీరామనవమి చైత్రశుక్ల నవమీ పునర్వసు నక్షత్రం మధ్యాహ్నము కర్కాటక లగ్నములో శ్రీరామచంద్రుడు అవతరించాడు.శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. రాముడు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని భక్తుల నమ్మకం. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే కావడం విశేషం. కోదండ రాముని కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల దేవతలు దివి నుండి భువికి దిగివచ్చి కల్యాణ మహోత్సవాన్ని చూసి పులకించిపోతారట. శ్రీరాముడు సత్యపాలకుడు,ధర్మాచరణం తప్పనివాడు,ఏకపత్నీ వ్రతుడు,పితృ,మాతృ,నిగ్రహం,సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ధ హృదయుడు.అందుకే ప్రతి ఏటా భద్రాద్రిలో జరిగే సీతారామ కళ్యాణాన్ని చూసి తరించిన వారి జన్మ సార్థకం అవుతుందని భక్తుల విశ్వాసం.మన కష్టాలను దూరం చేసే దేవుడు శ్రీరాముడు. ఏ కష్టం వచ్చినా పెద్దలు రామ రామ అనడం మీరు వినే ఉంటారు. జానకీవల్లభ అనేక మంత్రాలు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి, వృత్తిలో విజయాన్ని పొందడానికి, కష్టాలను తొలగించడానికి సహాయపడతాయి. రామ మంత్రాలను పఠించేవాడు చెడు నుండి రక్షించబడతాడు. రామ మంత్రం  మహిమ అద్భుతం. ప్రత్యేకించి, రామ మంత్రాలను పఠించడం ద్వారా శ్రీరాముడి ఆశీస్సులతో పాటు హనుమంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు.
శ్రీ రామనవమి రోజున తెల్లవారుజామునే   నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.  

కామెంట్‌లు