సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -475
ఖర్వాపేక్షిత ఫల న్యాయము
******
ఖర్వుడు అనగా పొట్టివాడు.అపేక్షీత అనగా కోరబడినది. ఫల అనగా పండ్లు అని అర్థము.
"పొట్టిగా ఉన్న వ్యక్తి అందని ఫలముల కొరకు ఆశ పడినట్లు" అని అర్థము.
దీనినే తెలుగులో"అందని పండ్లకు అర్రులు చాచినట్లు" అనే సామెతగా చెప్పుకోవచ్చు.
ఇక్కడ వ్యక్తిని పొట్టి వాడిగా చెప్పడం జరిగింది.అతడికి పండ్లు మాత్రమే అందవా? అంటే కాదనే చెప్పాలి.అందనంత ఎత్తులో ఉన్నప్పుడు ఏవైనా అందవు.సైకిల్ కు కాళ్ళు అందవు.బస్సులో ప్రయాణం చేసేటప్పుడు పడిపోకుండా పట్టుకోవడానికి పైన హ్యాండిల్స్ పట్టుకునేందుకు  చేతులూ అందవు.ఇలా పొట్టి వాళ్ళ పాట్లు ఎక్కువనే చెప్పుకోవాలి.
ఇలా ఎత్తును బట్టి అందడం, అందకపోవడం అనేది  సహజం.
మరి అది మాత్రమే దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పారా? అంటే కాదనే చెప్పాలి.
మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి న్యాయము వెనుక ఏదో ఒక అంతరార్థం ఖచ్చితంగా వుంటుందనేది మనకు తెలుసు.
 ఈ న్యాయములో కూడా తాహతుకు మించి అత్యాశల  ఫలాలను కోరుకోవడం అంటే  "పొట్టి వాడు అందని పళ్ళకు ఆశ పడినట్టే" అనే అర్థం యిమిడి వుంది. కాబట్టి  అలాంటి అత్యాశ, దురాశా ఫలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశించవద్దు. ఫలించని ఆశ దుఃఖానికి హేతువు కాబట్టి .ఆశ పడి, ప్రయత్నం విఫలమై వికల మనస్కులు కావడం కంటే అసలు వాటి జోలికి పోకుండా ఉండటమే మంచిది అనే అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ "ఖర్వాపేక్షిత న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి సంబంధించి మన చిన్నప్పుడు విన్న, చదువుకున్న "అందని ద్రాక్ష పుల్లన"కథ మనందరికీ తెలిసిందే.దానిని మరోసారి గుర్తు చేసుకుందామా.
అనగనగా ఒక నక్క  అలా అలా తిరుగుతూ ఓ రైతు వేసిన ద్రాక్ష తోటలోకి ప్రవేశిస్తుంది.   అందులో ఎత్తైన పందిళ్ళకు ద్రాక్ష పండ్లు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ కనిపిస్తాయి. వాటిని చూడగానే నక్కకు నోరూరుతుంది. తినాలనే కోరిక కలుగుతుంది.వెంటనే ముందు కాళ్ళతో అందుకో బోయింది.కానీ అందలేదు. ఎగిరి అందుకో బోయింది. తూలి కింద బొక్క బోర్లా పడితే దెబ్బలైతే తాకాయి కానీ పండ్లు మాత్రం ఆ నక్కకు అందలేదు. అలా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో బాధ పడుతూ అనుకుందట  "ఛీ! ఛీ! ఈ ద్రాక్ష పండ్లు పుల్లగా వుంటాయట. ఏమిటో వాటి కోసం అనవసరంగా ప్రయత్నం చేశాను" అని గొణుక్కుంటూ,తాకిన దెబ్బలను తడుముకుంటూ అక్కడి నుండి వెళ్ళి పోయిందట. అప్పటి నుండి "అందని ద్రాక్ష పుల్లన" అనే సామెత వాడుకలోకి వచ్చిందని మన పెద్దలు అంటుంటారు.
అంటే చేసిన తీవ్రమైన ప్రయత్నాలు ఫలించనప్పుడు బాధ పడకుండా మనసును సమాధాన పరచుకోవడం అన్న మాట.
దీనినే కొంచెం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే  ఇక్కడ పొట్టితనం అనేది  వ్యక్తి యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది. అంటే మానసిక మరుగుజ్జుతనం అంటే సంకుచిత స్వభావం.అలాంటి  వ్యక్తి మంచి ఫలాల్లాంటి ఫలితాలను ఆశిస్తే అవి ఎప్పటికీ అందవనే అర్థంతో అన్వయించుకోవచ్చు.
 ప్రతి దానికీ ఓ హద్దు అనేది వుంటుంది. మహా సముద్రం అంతటి దానికే చెలియలి కట్ట అనే హద్దు వుంది కదా!
 కోరికలను అదుపులో పెట్టుకోకుండా అందని ఫలాలు లేదా ఫలితాల కోసం వెంపర్లాడటం అనేది "పొట్టి వాడు అందని ఫలాల కోసం ఆశ పడ్డట్టేనని" తెలిసి పోయింది కదండీ!
 ఇదండీ!"ఖర్వాపేక్షిత ఫల న్యాయము" యొక్క అర్థము,అంతరార్థం. దీనిని  రెండు కోణాల్లో చూశాం కదా!
మనకున్న వివేచన విజ్ఞతతో  మనదైన కోణంలో నిశితంగా చూస్తూ అత్యాశ,దురాశల జోలికి పోకుండా మంచి ఆలోచనలు, ప్రయత్నాలు చేద్దాం.మంచి ఫలితాలను  పొందుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు