సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-470
కూష్మాండ స్తేయ న్యాయము
*****
కూష్మాండము అనగా గుమ్మడి కాయ, పిశాచ భేదము అనే అర్థాలు ఉన్నాయి.అస్తేయము అనగా దొంగతనం చేయకుండుట, దొంగ తనం చేయని అని అర్థము.
 "గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు"
అంటే ఏదైనా తప్పు చేసిన వాళ్ళు దాని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఉలిక్కిపడటాన్ని,తన తప్పుని తానే బయటపెట్టుకునే సందర్భంలో మన పెద్దలు ఈ సామెతను ఉదాహరణగా చెబుతుంటారు.
వెనుకటికెవరో  గుమ్మడికాయల దొంగెవరు అంటే తన భుజాలు తడుముకున్నాట్ట.అంటే తాను దొంగిలించి భుజాలపై మోసుకెళ్ళిన బూడిద లాంటి చిహ్నాలు భుజాలపై ఉన్నాయేమో  చూసుకుంటున్నాడుట.నిజముగా దొంగతనం చేయని వాడైతే కదలక మెదలక ధైర్యంగా వుండాలి కదా!ఎవరైనా తప్పు చేసి తొట్రుపాటులో వున్నప్పుడు ఈ సామెతను వాడుతారు.
చిన్నప్పుడు మన తాతయ్యలు,నాన్నమ్మ, అమ్మమ్మలు ఇంట్లో పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని ఇలాంటి సామెతల కథలు చెప్పేవారు.
ఆ రోజుల్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలే ఉండేవి.వివిధ వయసుల వారీగా పిల్లలతో ఇల్లంతా సందడిగా వుండేది.
పిల్లలంటే పిల్లలే.అల్లరి పనులకు చిరునామాలు కదా! ఇంట్లో చేసిన ఇష్టమైన పిండి వంటలు, పండ్లు మొదలైనవి అందరికీ సమానంగా పంచి ఇచ్చినా పిల్లల్లో మరికొన్ని తినాలని అనిపించడం, పంచదార లాంటివి ఇష్టం కాబట్టి వంటింట్లోకి వెళ్ళి ఎవరూ చూడకుండా డబ్బాల్లో ఉన్నది  గబుక్కున నోట్లో పోసుకుని రావడం చేసేవారు.
ఎంత చూడకూడదు అనుకున్నా అక్కడ వాటి తాలూకు ఆనవాళ్లు కనిపించేవి.
అమ్మలైతే నిలదీసి గద్దించడమో,తప్పు చేయొద్దని కొట్టడమో చేస్తారు కానీ అమ్మమ్మ, బామ్మ, తాతలు అలా కాకుండా అలా చేయడం తప్పని వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునేలా ఇలాంటి సామెతలను ఉదహరిస్తూ బోలెడన్ని కథలు చెప్పేవారు.అలా పిల్లల్లో  చక్కని మార్పుతో నైతిక విలువలు పెంపొందేవి.
 అలా మన తాతలు, బామ్మ, అమ్మమ్మలు చెప్పిన కథ మరోసారి మనం గుర్తుచేసుకుందామా.
ఒక ఊరిలో ఓ రైతు పెరట్లో బూడిద గుమ్మడి కాయ తీగ పాకి కాయలు కాస్తోంది. ఆ  రైతు ఆ కాయలతో వడియాలు పెట్టుకుందాం, పులుసు వండుకుందాం అనుకుని  ఓ రోజు కోద్దామని చూసేసరికి కాయలు కనబడలేదు.ఎవరో కోసుకుని వుంటారని అర్థమై పోయింది. ఇలా ఒకటి రెండు సార్లు కాయలు కోసుకుందాం అనుకునే లోపే ఎవరో కోసుకుని పోవడంతో రైతుకు చాలా బాధ కలిగింది.
వెంటనే ఆ వూర్లో పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి పరిస్థితి మొర పెట్టుకున్నాడు.
ఎవరి మీద అయితే అనుమానం వుందో వాళ్ళందరినీ రమ్మనమని పిలిపిస్తాడు.అలా వచ్చిన వారందర్నీ  కూర్చో బెట్టి గుమ్మడి కాయల దొంగతనం విషయం చెప్పి,"ఎవరైతే గుమ్మడి కాయలు దొంగతనం చేస్తారో వారికి వీపు మీద సొట్ట పడుతుంది" అని ఇంకా చెప్పబోయేటప్పటికే రైతు ఇంటి పక్కనే ఉంటున్న వ్యక్తి భుజాలను తడుముకోవడం ఆ పెద్ద మనిషి గమనిస్తాడు.ఇంకా విషయం పొడిగించకుండా ఆ వ్యక్తిని లేపి ఇతడే దొంగ అని చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోతారు.
గుమ్మడి కాయలు బరువుగా వుంటాయి కాబట్టి  పల్లెల్లో వాటిని భుజాలపై మోసుకుంటూ వెళ్తారు.ఐతే మోసుకెళ్ళేటప్పుడు దానికి ఉన్న బూడిద భుజానికి అంటుకుంటుంది.కానీ అంత మాత్రాన భుజం సొట్ట పోదు కదా! తప్పు చేసిన వ్యక్తికి అలాంటి ఇంగితం వుండదు.పట్టుపడతానేమోననే భయంతో  వారి ప్రవర్తనలోనూ, హావభావాలలోనూ కనిపించే వాళ్ళ తొట్రుపాటు చర్యలను బట్టి దొంగెవరో ఇట్టే పసిగట్ట వచ్చు.
ఇదండీ "కూష్మాండ స్తేయ న్యాయము" అంటే.
దొంగతనం చేయడం మెందుకు? అలా అందరి ముందు దోషిగా నిలబడటం ఎందుకు?
తప్పుడు పనులు, దోషాలు, దొంగతనాలు చేసేవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా పట్టు పడతారు. అలా కాకుండా సత్యం,ధర్మం, నీతి, నిజాయితీ  పాటించేవారు చాలా నిర్భయంగా, నిబ్బరంగా  వుంటారు.నీతి నియమాలు పాటించే వారు ఎవరికీ తలవంచాల్సిన, భయపడాల్సిన అవసరం లేదన్నది చిన్నప్పటి నుండే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.
తప్పు చేయకు - పట్టుపడకు అని సత్యాన్ని  బోధించే ఈ న్యాయమును పిల్లలకు   పిల్లలకు   చిన్నప్పటి నుండే అర్థమయ్యేలా  విడమరచి చెబుదాం. నిఖార్సైన రేపటి తరాన్ని తయారు చేసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏
కామెంట్‌లు