సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -471
కేకరాక్షి న్యాయము
    ****
కేకర అనగా మెల్లకంటి వ్యక్తి, మెల్లకన్ను.అక్షి అనగా కన్ను అని అర్థము.
మెల్లకన్ను  వున్న వ్యక్తి ఒకవైపు చూస్తూ ఉంటే మరో వైపు చూస్తున్నట్లు కనిపిస్తుంది.
 అలాంటి మెల్లకన్ను గురించి  మనలో చాలానే మూఢ నమ్మకాలు ఉన్నాయి.నేటికీ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు మెల్లకన్నును  అదృష్టంగా భావిస్తుంటారు. అయితే అది నిజం కాదు. కంటి నిర్మాణంలో లోపం వల్ల మెల్ల కన్ను వస్తుంది.కొందరి పిల్లలకు  పుట్టుకతోనే మెల్లకన్ను వస్తుంది.మరి దీనిని గురించి మరిన్ని వివరాలు, విషయాలు తెలుసుకుందాం.
 మెల్లకన్ను అదృష్టం అసలే కాదు.పైగా దురదృష్టమనే చెప్పుకోవాలి.నిజానికి ఇది ఓ జబ్బు లాంటిది.దీనిని గుర్తించిన వెంటనే సరిచేసుకోకపోతే, ఏం కాదులే అని నిర్లక్ష్యం చేస్తే చూపుకే ప్రమాదం వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
మన కళ్ళు అద్భుతమైన కెమెరాల వంటివి.కనుగుడ్లు రెండూ సమన్వయంతో పని చేస్తూ వుంటాయి.చూపును ఎటువైపు సారిస్తే ఆ దిశగా కదులుతూ ఒకే దృశ్యాన్ని గ్రహించి మెదడుకు పంపిస్తాయి.ఇలా కనుగుడ్లు సమన్వయంతో చూసేందుకు కంటి వెనుక ఆరు కండరాలు పనిచేస్తాయట.
అలా కాకుండా ఒక కన్ను  ఒక వైపు,మరో కన్ను ఇంకో వైపు చూడటం వల్ల చూపులో సమన్వయం లోపిస్తుంది.మెల్లకన్ను వచ్చిన వారిని గమనించినప్పుడు వారి కళ్ళు సమరేఖలో లేవని స్పష్టంగా తెలుస్తుంది.అందుకే అలాంటి మెల్లకన్ను ఉన్న వారు మన వైపు చూస్తున్నా వేరే ఎటో చూస్తున్నట్లుగా అనిపిస్తోంది.
 
ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే  పూర్తిగా కాకపోయినా కొద్దిగా మెల్ల వున్న వారిని గబుక్కున వారికి మెల్లకన్ను ఉన్నట్టు గుర్తించలేం.ఇటువైపు చెబుతూ వుంటే అటెటో చూస్తారేమిటి అని అపోహ పడుతుంటాం. అలా పడవద్దని చెప్పడానికీ, అలా వున్నట్లు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించమని చెప్పమనడానికే ఈ న్యాయమును మన పెద్దలు చెప్పి ఉంటారేమోనని నా అనుమానం.మీ ఉద్దేశం కూడా అదే అయివుంటుంది కదండీ!
పనిలో పనిగా దీనికి దగ్గరగా ఉన్న మరో సామెత "గుడ్డికన్ను కన్న మెల్ల కన్ను నయం" గురించి చెప్పుకుందాం.
 మెల్లకన్ను కొంత కనబడుతుంది.సరిచేయడానికి వీలవుతుంది.కానీ గుడ్డికన్ను అలా కాదు కదా! పుట్టుకతో వచ్చిన అంధత్వం  దాదాపుగా సరిచేసే వీలు వుండదు అంటారు .అందుకే "గుడ్డిలో మెల్ల అన్నట్లు" అంటుంటారు.
 'కేకరాక్షి  న్యాయము" ను సరదాగానో,ఆటపట్టించడానికో తీసుకోకుండా వారి  కంటి లోపాన్ని సవరించుకునేలా మన వంతు సహకారం అందేలా చూద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు