జీవితమా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

ప్రకృతి దృశ్యంలా
అద్దాల సౌధంలా
అందాల బొమ్మలా
శ్రావ్య రాగంలా
చక్కెర తీపిలా
జీవితమా సాగిపో

బండి చక్రాల్లా
కడలి కెరటాల్లా
కాంతి ప్రసారణలా
గాలి పయనములా
జింకల పరుగుల్లా
కాలమా గడచిపో

రవి కిరణములా
శశి వెన్నెలలా
తారల తళుకుల్లా
మెరుపు తీగల్లా
ఇంద్ర ధనస్సులా
కాయమా వెలిగిపో

ఆకాశంలో మేఘాల్లా
ఎగురుతున్న పక్షుల్లా
పూలపై తుమ్మెదల్లా
సుమాల సౌరభంలా
నీటి ఆవిరిలా
చైతన్యమా కదలిపో

ఊరుతున్న జలలా
ఉరుకుతున్న సెలయేరులా
పొంగుతున్న పాలులా
ప్రవహిస్తున్న నదిలా
కరుగుతున్న హిమంలా
మనసా ముందుకుపో

అక్షర సుమాల్లా
పదాల మాలల్లా
ఊహల పందిరిలా
భావ పరంపరలా
కమ్మని కల్పనల్లా
కవితా రూపందాల్చుకో

కామెంట్‌లు