పేర్లతో కూడిన సంవత్సరాలు తెలుగువారి సొంతం; -డాక్టర్ అడిగొప్పుల సదయ్య
 తెలుగువారు చాంద్రమానం ప్రకారం కాలాన్ని గణనం చేస్తారు.ప్రపంచంలో మరెవరికీ లేని "అరవై సంవత్సరాలు"(అరవై ఉగాదులు) తెలుగువారికి మాత్రమే ఉన్నాయి.ఆనాటి మానవుడి జీవన ప్రమాణం అరవై సంవత్సరాలు.అరవై సంవత్సరాలకు పేర్లు పెట్టుకొని అద్భుతంగా జీవితకాలాన్ని విభజించుకున్నారు.అరవై సంవత్సరాలలో ఏదో ఒక సంవత్సరంలో పుట్టిన మనిషి తిరిగి ఆ సంవత్సరం వరకు బ్రతికి ఉంటే "షష్ఠిపూర్తి" కార్యక్రమం చేసుకొనేవాడు.ఒక మనిషి అరవై సంవత్సరాల కాలచక్రమును పూర్తిచేస్తే అది అతని "షష్ఠిపూర్తి" అన్నమాట.ఎంత చక్కని ప్రణాళిక.ఆ అరవై సంవత్సరాలకు కూడా ఆయా సంవత్సరాలలో వచ్చే మార్పులను, లక్షణాలను ఆకళింపుచేసుకొని తదనుగుణంగా నామకరణాలు చేశారు.ఇది తెలుగువారి ఘనత.
     తెలుగువారి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమితో ప్రారంభం అవుతుంది.ఉగాదులకు వివిధ పేర్లున్నప్పటికీ అన్ని ఉగాదులు ఇదే రోజు ప్రారంభమవుతాయి.ఇదే రోజు ప్రారంభం కావడానికి పండితులు కొన్ని ఐతిహ్యాలు చెబుతారు.ఈరోజే శ్రీమహావిష్ణువు మత్స్యావతారుడై సోమకాసురుని చంపి నాలుగు వేదాలను బ్రహ్మకు అందజేశాడనీ,అపుడు బ్రహ్మ ఆ వేదాలకు అనుగుణంగా సృష్టి చేయడం ప్రారంభించాడని అందుకే "సృష్టి ప్రారంభం"నకు సంకేతంగా ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఒక ఐతిహ్యం.కాలంలో మార్పులకు కారణం నక్షత్రాల గమనం.ఈ నక్షత్రాల నడక వలననే పగలు, రాత్రులు,దినాలు,వారాలు,పక్షాలు,మాసాలు,రుతువులు,ఆయనాలు, సంవత్సరాలు,వగైరా ఏర్పడుతున్నాయి."ఉడు" అంటే నక్షత్రం అని అర్ధం,"గ" అంటే " గమనం/నడక" అని అర్ధం,"ఉడుగ" అంటే " నక్షత్రాల గమనం" అని అర్ధం."ఉడుగ ఆది" అంటే " నక్షత్రాల కదలిక ప్రారంభమైన రోజు " అని అర్థం.(ఉగస్య ఆది ఉగాది).ఈ "ఉడుగ ఆది" కాలక్రమేణా "ఉడుగాది" గా,"ఉగాది" గా మారిందని మరొక ఐతిహ్యం.తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఇదే రోజు పట్టాభిషిక్తుడై పరిపాలన చేయడంతో ఇది పండుగ రూపాన్ని సంతరించుకుని తరతరాల నుండి కొనసాగుతూ వస్తోంది."యుగం" అనగా "జంట" అని అర్థం,ఉత్తరాయణ మరియు దక్షిణాయణ కాలాలను కలిపి సంవత్సరం అంటారు.ఈ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమవుతుంది కనుక "యుగాది" అంటారని,అదే "ఉగాది"గా రూపాంతరం చెందిందని కొందరు పండితుల వాదన.ఏది ఏమైనప్పటికి తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం "చైత్ర శుద్ధ పాడ్యమి"  రోజున ప్రారంభమవుతుంది అనేది నిర్వివాదాంశం.
క్రోధ్యభ్దే సతతం రోగా: క్రోధ లోభ పరాయణా.
ఈతి దోషేణ సతత మధ్య సస్యార్ఘ వృష్టయ.
       భావం: ఈ సంవత్సరంలో జనులంతా రోగాల పాలవుతారనీ,క్రోధ లోభ లక్షణాలతో జీవిస్తారని,ఈతి బాధలు నిరంతరం జనులకు పీడిస్తాయనీ, పంటలు కోతకు రాకముందే నాశనమవుతాయనీ మన పూర్వీకులు ఈ సంవత్సరం యొక్క లక్షణాలను అనుభవపూర్వకంగా నిర్ణయించడం జరిగింది.
క్రోధి నామ ఉగాది తేది 09-04-2024 నుండి మొదలవుతుంది.గత ఏడాది శోభకృత్ సంవత్సరము.రాబోయే ఏడాది శ్రీవిశ్వావసు నామ సంవత్సరము.ఇంతవరకూ సృష్ట్యాది నుంచి
195,58,55,125 సౌరాబ్ధములు;
వర్తమాన మహాయుగ గతాబ్దాలు
38,97,225;వైవశ్వత మనుగతాబ్దాలు 12,05,33,125;
కల్యాది గతాబ్ధాలు 5,125; విక్రమార్క శక గతాబ్దాలు 2,081;శాలివాహన శక గతాబ్ధాలు 1,946; శ్రీమద్రామానుజాచార్య అవతార గతాబ్దాలు1,007; ప్రభవాది గతాబ్ధాలు 37 గడసినవి.
       ఒక్క తెలుగువారే కాకుండా ఈ ఉగాది పండుగను మరాఠీలు "గుడి పడ్వాగానూ",తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను,సిక్కులు "వైశాఖీగానూ", బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు.
         శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది.చెట్లు చిగుర్చి ప్రకృతి చైతన్యవంతమై శోభాయమానంగా వుంటుంది.గండుకోయిలలు కుహూకుహూ అని పాడుతాయి.ఉగాది రోజు నుండే "తెలుగు సంవత్సరం" మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి.ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు,శుభ్ర పరచుకుంటారు.ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి,ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది.షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం.సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను,కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.ఈ పచ్చడి కొరకు చెరకు,అరటి పళ్ళు,మామిడి కాయలు,వేపపువ్వు,చింతపండు,జామకాయలు,బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
     ఈ రోజున నింభపుష్పభక్షణం,పంచాంగ శ్రవణము,మిత్రదర్శనము,ఆర్యపూజనం,గోపూజ,ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు.శాస్త్రీయంగా కూడా పరిశీలిస్తే ఈ కాలం రుతువులు మారే కాలం కావున ప్రజలంతా రోగాల బారిన పడకుండా "వేపపువ్వుతో కూడిన ఉగాది పచ్చడిని" తినడం వలన శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.తెలంగాణా ప్రాంతంలో ఈరోజు శెనగపిండి,బెల్లం,సోంపు,పల్లీలతో చేసిన భక్ష్యాలు (బచ్చాలు)అనే ప్రత్యేక పిండి వంటను ఆరగించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.
    ఈ తెలుగు వారి క్రోధి నామ ఉగాది ప్రపంచంలోని ప్రజలందరికి సంతోష సౌభాగ్యాలు ఇవ్వాలని,ఒడిదుడుకులు లేకుండా జీవనం కొనసాగాలని, ప్రజలందరూ ఆదాయంలో ఆకాశాన్ని అందుకోవాలని,రాజపూజ్యంతో అపార సన్మానాలు పొందాలని ఆకాంక్షిస్తూ....

శుభం భూయాత్
సర్వే జనా సుఖినోభవంతు
సమస్త సన్మంగళాణి భవంతు
మీ సాహితీ పిపాసి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం
9963991125
కామెంట్‌లు