సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -477
గగన రోమంధ న్యాయము
****
గగనము అంటే ఆకాశము,అంబరము.శూన్యము, దుర్లభము, మహా వాయువు, సున్న, స్వర్గము.రోమంధ అనగా నెమఱు వేయుట, పశువుల చర్విత చర్వణము అనే అర్థాలు ఉన్నాయి.
ఆకాశమున ఆవులు నెమరేసిన నురుగు వున్నట్లు అని అర్థము.
గగనం అంటేనే శూన్యం.కానీ నీలిరంగులో కనిపిస్తూ సూర్యుడు,చంద్రుడు, నక్షత్రాలు, పరుగులు తీసే మేఘాలు వింత వింత రూపాల్లో కనువిందు చేస్తూ మురిపించే, మైమరిపించే ఆకాశం.మానవుడు ఎన్నెన్ని పరిశోధనలు చేసి ఆ అంతరిక్ష రహస్యాలను తెలుసుకున్నా  తెలిసింది అణువంత, తెలియనిది కొండంత.
మనిషి ఊహల ప్రపంచంలో ఆకాశం  ఓ వీధి లాంటిది.చంద్ర వంకకు ఊయల గట్టి ఊగనూ వచ్చు.మబ్బుల పల్లకి ఎక్కి ఊరేగనూ వచ్చు.రెక్కలు కట్టుకొని పక్షుల్లా గగన విహారం చేయనూ వచ్చు.
మరి అలాంటి ఆకాశ మైదానంలో ఆవులు నెమరేస్తూ వుంటే నోటి నుండి  తెల్లని నురుగు రాకుండా వుంటుందా? చదువుతుంటే ఆ దృశ్యం కళ్లముందు కదలాడకుండా వుంటుందా? చెప్పండి.
మనిషి  యధార్థాలూ, ఋజువులను తెలుసుకునేందుకు ఆరాట పడుతూనే అందమైన అబద్ధాలు,భ్రమలు అంటే ఇష్ట పడుతుంటాడు అని చెప్పడానికే ఈ "గగన రోమంధ న్యాయము"ను సందర్భానుసారఃగా  మన పెద్దలు ఉదహరిస్తూ వుంటారు.
 ఈ న్యాయములో ఉత్ప్రేక్షాలంకారం ఉంది.
అనగా ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం.ఉత్ప్రేక్ష అంటే ఊహ.అసమంజసం, అసహజం అయిన అంశాన్ని సమంజసమైనట్టు,సహజమైనట్టు వర్ణించడం.
"ఏనుగు నడిచే కొండలా అనిపిస్తోంది." ఆకాశంలో మబ్బులు గున్న ఏనుగుల్లా కనిపిస్తున్నాయి.
ఓ కవి అన్నట్టుగా "చేదు నిజం కంటే తీయని అబద్ధమే బాగుంటుంది‌" అన్నట్లు   అబద్ధాలు,అసహజాలే మనసును మాయ చేసి హాయిని ఇస్తాయనేది ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోగలిగాం. అలా ఊహలు, కల్పనలు అప్పుడప్పుడూ మనసుకు  సాంత్వన ఇచ్చే ఔషధాలు కూడా అవుతుంటాయి.

కామెంట్‌లు