సుప్రభాత కవిత ; - బృంద
కొండలలోనా కోనలపైనా
కురిసేనదిగో వెలుగులవానా

గుండెలలోనా  కన్నులనిండా
మెరిసేనదిగో  బంగరు కొండా

దివి నుండి దిగివచ్చు
జ్యోతి కలశపు కిరణాలు
భువిని తాకుట కొరకు
శిఖరాలే సోపానాలు.

నిలిచి స్వాగతించె
నిలుచున్న  తరువులు
నిండుమనసుల ప్రేమ
నీరాజనములతో.....

నింగిని మొదలైన కనకధార
నేలను చేరు దారిలో
కొండ వాగుల నీటిని మార్చె
కాంచనమయముగా...

గగనాన వేగముగా సాగు
పాలమబ్బుల గుంపులు 
గుబులుగా  అటునిటు తిరిగె
కాంతులు భూమిని తాక అడ్డగిస్తూ..

ఆకసాన అరుణరథముపై
ఆదిత్యుని ఆగమనము
అనుగ్రహముగ కొత్త రోజును
అందింప వేంచేయు వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు