నా కలం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నా గుండె
కలంలో ప్రతిధ్వనిస్తుంది
నాతో కడుకవితలను
కూర్పించి పఠింపజేస్తుంది

నా మనసు
కలాన్ని ఆడిస్తుంది
కాగితాల మీద
గీతలు గీయిస్తుంది

నాకలం
అప్పుడప్పుడు కత్తవుతుంది
అవినీతిపరులను
అడ్డంగా నరికేస్తుంది

నాకలం
అప్పుడప్పుడు నిప్పవుతుంది
అక్రమార్కులను 
కాల్చి బూడిదచేస్తుంది

నాకలం
అప్పుడప్పుడు నీరవుతుంది
కల్మషాలను
కడిగి ప్రక్షాలనచేస్తుంది

నాకలం
అప్పుడప్పుడు పువ్వవుతుంది
పరిమళాలని
వీచి పరవశపరుస్తుంది

నాకలం
అప్పుడప్పుడు వెలుగవుతుంది
అఙ్ఞానాంధకారాలను
తన్ని తరిమిపారేస్తుంది

నాకలం
అప్పుడప్పుడు అందాలనుచూపుతుంది
ఆస్వాదించేవారికి
ఆనందాలను అందించుతుంది

నా కలం
అప్పుడప్పుడు ప్రబోధాలుచెబుతుంది
మంచి మార్గాలనుచూపి
ముందుకు వడివడిగానడిపిస్తుంది

నా కలం
అప్పుడప్పుడు ప్రేమనుచూపుతుంది
అభిమానానురాగాలు
కుమ్మరించి కుతూహలపరుస్తుంది

కలంవ్రాసినట్టి
కైతలను వల్లెవెయ్యి
కవిపేరుని
కలకాలము మదిలోనిలిపెయ్యి

కలలు
అప్పుడప్పుడు వస్తాయి
మదినిముట్టి
కలాన్ని పట్టిస్తాయి

కవితాకన్యక
అప్పుడప్పుడు కనబడుతుంది
కవ్వించి
కలాన్నిచ్చి కైతలువ్రాయిస్తుంది

ఊహలు
అప్పుడప్పుడు ఊరతాయి
ఊరుకోనీక
కలాన్నికదిలించి కవనంచేయిస్తాయి

కలమును
ప్రేమించు
కవితలను
పఠించు

నా కలాన్ని
తీసుకెళ్ళకు
దాన్ని నాకు 
దూరంచెయ్యకు

కలము
నా బలం
నా ఆయుధం
నా ప్రాణం


కామెంట్‌లు