సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-468
క్రమ విపర్యాస న్యాయము
*****
క్రమ అనగా అడుగు, పోవుట, బలిమి, పాదము ,ప్రారంభము,వరుస, పద్ధతి, పట్టు,సిద్ధము, చేయుట,సిద్ధమగుట, పూనిక, వేదాధ్యయన భేదము.విపర్యాస అనగా వ్యత్యాసము అని అర్థము.
ముందుది వెనుక, వెనుకది ముందు క్రమ భంగముగ పనులలో ప్రవర్తించుట, చేయుట అని అర్థము.
 పనులు ఏది ముందు ఏది వెనక చేయాలో తెలియని తనముతోనో,అతి తెలివితోనో అవకతవకలుగా పని చేసే వ్యక్తులను ఉద్దేశించి  ఈ  న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 ఒక క్రమ పద్ధతిని పద్దతిలో అలాగే ఉండనీయకుండా ఇష్టం వచ్చినట్టు మార్చడం అన్న మాట. దీనినే తెలుగులో "ఎడ్డెం అంటే తెడ్డెం" అనే సామెతతో పోల్చి చెప్పుకోవచ్చు.
 దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దామా...  
మన ఇళ్ళల్లో అవకతవకలు, అడ్డదిడ్డంగా పనులు  చేసే వారిని ఉద్దేశించి మన పెద్దవాళ్ళు తరచూ ఈ కథను చెబుతూ ఉంటారు.
పూర్వ కాలంలో ఉద్దాలకుడు అనే ముని అతని భార్య చండి అనే దంపతులు ఉండేవారు. ఆ మునికి,ముని భార్యకు ఎప్పుడూ సరిగా పొసగేది కాదు. ఉప్పు  నిప్పులా అన్నమాట.ముని ఏది చెప్పినా భార్య చండి దానికి  పూర్తిగా వ్యతిరేకంగా చేస్తూ వుండేది.ముందు చెప్పింది తర్వాత, తర్వాత చేయమని చెప్పింది ముందు చేస్తూ వుండేది .అలా ఆ మునిని బాగా విసిగించేది.
ఎలా దీనికి పరిష్కారం తెలియక బాధ పడుతూ తన గురువు గారిని అడిగాడు .ఆయన ఓ చక్కని సలహా ఇచ్చి,నీకిక తిరుగులేదు పో అన్నారు.
సంతోషంగా ఆ సలహాను మనసులో  మననం  చేసుకుంటూ తన తండ్రి గారి ఆబ్ధికానికి ఆచరణలో పెట్టాడు.
భార్యతో" నేను రేపు మా తండ్రి గారి ఆబ్దికం పెట్టబోవడం లేదు" అని  అన్నాడు.ఆమె ఎలాంటిదో మనకు తెలుసు కదా! "అట్లెట్లా ? ఎందుకు పెట్టరు?  పెట్టాల్సిందే, కార్యక్రమం చెయ్య వలసిందేనని పట్టుబట్టింది.
 
ముని లోలోపల సంతోషిస్తూ "రేపటి ఆబ్దికానికి కావలసిన సరుకులు తీసుకురాను. బ్రాహ్మణులను అసలే పిలవను? అంటాడు. ఆమె వెంటనే  అదేంటి? అలా అంటారు? మీరు సరుకులు తేవాల్సిందే. నేను వండాల్సిందే. అలాగే బ్రాహ్మణులను తప్పకుండా పిలవాల్సిందే " అని గట్టిగా చెబుతుంది.
ఇంకేముంది ఇష్టం లేనట్టు నటిస్తూ అన్నీ వ్యతిరేకంగా చెప్పడంతో ఆబ్దికం సజావుగా ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది.
 అలా చక్కగా జరిగిపోయిందన్న ఆనందం పట్టలేక తాను అప్పటి వరకు నటించింది, వ్యతిరేకంగా మాట్లాడింది, గురువు  గారు చెప్పింది మర్చిపోయి "ఆబ్దికానికి చేసిన పిండాలను నదిలో కలపాలి" అంటాడు.
ఇంకేముంది ఎడ్డెం అంటే తెడ్డెం అనే అతని భార్య  "చత్! నదిలో ఎలా కలుపుతారు? అంటూ  వాటిని పెంట కుప్ప మీద పారేస్తుంది.
అంత వరకు చేసినదంతా వృధా అయిపోతుంది. దాంతో కోపం వచ్చిన ఉద్దాలకుడు ఆమెను శిలవై పొమ్మని శాపం పెడతాడు,ఆ తర్వాత శాప విమోచనం ఎలాగో చెబుతాడు లెండి. కానీ అప్పటి వరకూ మంచిగా జరిగిందంతా 'బూడిదలో పోసిన పన్నీరు ' అయ్యింది కదా!
 ఇదండీ కథ! ఇలాంటి వ్యక్తులు  కొందరు మనకు నిత్య జీవితంలో అప్పుడప్పుడు తారసపడుతుంటారు.
 ఇంకొందరు వెర్రి వెంగళప్పలు కూడా ఉంటారు.కుశల ప్రశ్నలు అడిగేటప్పుడు ఏది ముందు ఏది వెనుక అడగాలో తెలియదు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఎదుటి వ్యక్తులు ఒకోసారి నివ్వెర పోవాల్సి వస్తుంది.
పెళ్ళయిందా? కాలేదు అంటే అంతటితో ఆగాలి కదా! పిల్లలు ఎంత మంది? అనో, ముందు పిల్లల వివరాలు అడిగి ఆ తర్వాత పెళ్ళయిందా? అనో  ముందు ప్రశ్న వెనుక వెనుక ప్రశ్న ముందు అడుగుతుంటారు.
 
ఆయా వ్యక్తుల గురించి తెలిసిన వారికైతే  పోనీలే వారిది అమాయకత్వం అనుకుంటూ వదిలేస్తారు.కానీ తెలియని వారికి ఈ ప్రశ్నలు ఎంత యిబ్బందిగా వుంటాయో చెప్పనక్కర్లేదు.
 ఇది సంభాషణల్లో అయితే ఏమో కానీ ఏవైనా సైన్స్  పరంగా ప్రయోగాలు చేసేటప్పుడు ఐతే? ఊహించలేం జరిగేవి ఇక అనర్ధాలే కదండీ!
 మన నిత్య జీవితంలో చండి లాంటి ఎడ్డెం-తెడ్డెం మనుషులు,వెర్రి వెంగళప్పల్లాంటి మనుషులు తారసపడితే ఓ మాకు  తెలుసు.ఇలాంటి వారు ఉంటారని మా పూర్వీకులు ఎప్పుడో  "క్రమ విపర్యాస న్యాయము" ద్వారా చెప్పారని సగర్వంగా చెప్పుకోవచ్చు. 
మరి మనకు తెలిసిన అలాంటి సరదా సంఘటనలు మరికొన్ని చెప్పుకొని హాయిగా నవ్వుకుందాం.ఏమంటారూ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు