తల్లిని కాపాడిన పిల్లలు - డా.ఎం.హరికిషన్

 ఒక అడవిలో ఒక మేక వుండేది. దానికి చందమామల్లాంటి బుజ్జిబుజ్జి పిల్లలు వున్నాయి. ఒకరోజు అవన్నీ కలసి మేతకు పోయాయి. అడవంటే మాటలు కాదు గదా... ఆపదలు ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వచ్చి మీద పడతాయో తెలీదు. ఆ అడవిలో ఒక నక్క వుంది. దాని కన్ను మేక మీద పడింది. ''ఆహా! దొరికిందిరా పసందైన విందు భోజనం'' అనుకుంటా ఎగిరి దాని మీదకు దుంకింది. తల్లీపిల్లలు బెదిరిపోయి తలోదిక్కు పరుగు అందుకున్నాయి. ''ఈ చిన్న చిన్న పిల్లలు నాకెందుకు. ఎన్ని తిన్నా కడుపులో ఒక మూలకు గూడా సరిపోవు. పడితే ఆ పెద్ద మేకనే పట్టాలి. నాలుగు రోజులు కమ్మగా కాలు మీద కాలేసుకోని తినొచ్చు'' అనుకొని దాని వెంట పడింది. అది బెదపడి మరింత వేగంగా వురకసాగింది. దారిలో ఒకచోట ఒక పెద్ద గుంత వుంది. మేక అది చూసుకోలేదు.సక్కగా పోయి దభీమని దానిలో పడిపోయింది. ఆ గుంత చానా లోతుగా వుంది. నక్క వురుక్కుంటా ఆ గోతి కాడికి వచ్చింది. కింద అందేంత దూరంలోనే ఆహారం వుంది. కానీ దిగితె పైకి రావడం అంత సులభం గాదు. ''ఆశకు పోతే గాలానికి చిక్కుకున్న చేపలాగా చావడం ఖాయం. అడవేం చిన్నది గాదు. ఇది కాకపోతే ఇంకొకటి దొరుకుతుంది'' అనుకుంటా గమ్మున తిరిగి వెళ్ళిపోయింది. ఇక్కడ మేకపిల్లలన్నీ తలా ఒక దిక్కు పారిపోయాయి గదా... అవన్నీ మళ్ళా నెమ్మదిగా ఒక చోటికి గుంపయ్యాయి. అమ్మను వెదుక్కుంటా బైలుదేరాయి.
అలావెదుకుతా వెదుకుతా చివరికి ఆ గుంత దగ్గరికి చేరుకున్నాయి. అప్పటికే ఆ మేక బైటకి రావడానికి ఎగిరీ ఎగిరీ అలసిపోయి, ఇంగ లాభం లేదు అనుకోని మౌనంగా వుండిపోయింది. పిల్లలన్నీ ఆ గుంత చుట్టూ చేరాయి. ''అమ్మా... అమ్మా...'' అంటా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాయి.
పిల్లలని చూసి తల్లికి గూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కాసేపటికి అది తేరుకోని ''పిల్లలూ... చీకటి పడతా వుంది. మీరంతా ఇంటికి వెళ్ళండి. ఇక ఈ రోజుతో మీకూ నాకూ ఋణం తీరిపోయింది. మీరంతా హాయిగా కలసి మెలసి వుండండి. అనవసరంగా చిన్న చిన్న వాటికి గొడవ పడకండి'' అంటా మంచిమాటలు చెప్పింది. ఆ మాటలకు పిల్లల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ''అమ్మా... నీతో బాటు మేమూ ఇక్కడే వుంటాం. చావయినా బతుకయినా నీతోనే. నిన్ను వదలి ఎక్కడికీ వెళ్ళం'' అన్నాయి. అప్పుడు ఒక చిట్టిమేక ''మనం ఇలా గంటలు గంటలు కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏం లాభం లేదు. చీకటి పడేలోగా అందరం తప్పించుకోవాలి. వుత్తమాటలతో, కళ్ళనీళ్ళతో పనులు గావు. బుర్రలకు పదును పెట్టండి. సమయం చాలా తక్కువగా వుంది'' అనింది. అన్నీ ఆలోచనలో పడ్డాయి. కాసేపటికి ఒక బుజ్జిమేక ఆనందంగా ''అన్నలారా... అదిగో అక్కడ చూడండి. ఒక పెద్ద తీగ లావుగా బలంగా వుంది. దాన్ని తెంపి లోపలికి వదులుదాం. అమ్మను పైకి లాగుదాం. ఎలా వుంది నా ఆలోచన'' అంది. ఆ ఉపాయం అన్నిటికీ భలే నచ్చింది. వెంటనే పరుగెత్తుకోని పోయి ఆ తీగను నోటితో కొరికి తెంపాయి. దాన్ని మోసుకోని వచ్చి లోపలికి వదిలాయి. ''అమ్మా... నువ్వు ఒకవైపు గట్టిగా నోటితో పట్టుకో. మేమంతా మరొక వైపు పట్టుకొని పైకి లాగుతాం. ఏం సరేనా'' అన్నాయి సంబరంగా. పిల్లల తెలివికి అమ్మ ఆనందంతో మురిసిపోయి 'సరే' అంది. ఆ తీగను గట్టిగా పట్టుకొంది. రెండవ వైపు పిల్లలన్నీ కలసి పట్టుకొని  ''లాగర లాగు హైలెస్సా... గట్టిగ లాగు హైలెస్సా... అందరు కలసి హైలెస్సా... అమ్మను లాగు హైలెస్సా'' అని అరుచుకుంటా లాగసాగాయి.
కానీ అవెంత. వాటి బలమెంత. బుజ్జి బుజ్జి పిల్లలు. ఎంత లాగినా తల్లి ఒక్క ఇంచు గూడా పైకి రాలేదు. లాగీలాగీ వాటి పళ్ళు నొప్పి పెట్టాయి. చేతగాలేదు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అన్నీ గుంత చుట్టూ చేరాయి. ''అమ్మా... మేం ఓడిపోయాం. నిన్ను కాపాడుకోలేక పోతా వున్నాం'' అన్నాయి దిగులుగా. అంతలో ఒక చిట్టిమేకకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ''తమ్ముల్లారా... మనమంటే చిన్న చిన్న పిల్లలం. బలం తక్కువ. అమ్మను బైటకు లాగలేక పోతా వున్నాం. అదే అమ్మయితే మనలని గుంతలో నుండి ఒక్క నిమిషంలో బైటకు లాగగలుగుతుంది'' అంది. మిగతావి తల గోక్కుంటా ''నిజమే... నువ్వు చెప్పేది. కానీ గుంతలో వున్నది అమ్మగానీ మనం కాదు గదా'' అన్నాయి. అప్పుడు ఆ చిట్టిమేక చిరునవ్వు నవ్వుతా ''అన్నలారా... మనం అందరం గుంతలోకి దుంకేద్దాం. మన మీదకు ఎక్కి అమ్మ బైటకు ఎగురుతుంది. ఆ తరువాత మరలా మనందరినీ ఒక్కొక్కటిగా పైకి లాగుతుంది. ఏమంటారు'' అంది. అన్నింటికీ ఆ ఆలోచన తెగ నచ్చేసింది. వెంటనే ''అమ్మా'' అంటా ఒక్కొక్కటి లోపలికి దుంకేశాయి. పిల్లలు ఒకదాని పక్కన ఒకటి నిలబడ్డాయి. తల్లిమేక వాటిపైకి ఎక్కి ఎగిరి గట్టు మీదకు చేరుకుంది. తరువాత ఒక్కొక్కదాన్ని తీగతో పైకి లాగేసింది. ఆ రోజు వెన్నెల వెలుగుల్లో తనను కాపాడిన పిల్లలకు కోరినవన్నీ చేసిపెట్టి గొప్ప విందు ఇచ్చింది.
***********
కామెంట్‌లు