సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -460
కులాల చక్ర న్యాయము
****
కులాల అంటే కుమ్మరి ‌చక్రము అంటే బండి చక్రము, కుమ్మరి చక్రము, విష్ణువు ఆయుధ విశేషము, సమూహము.కుమ్మరి చక్రం అంటే కుమ్మరి మట్టి పాత్రలను గుండ్రని చక్రం ఆకారంలో తయారు చేయడానికి ఉపయోగించే యంత్రం కుమ్మరి చక్రము. దీనిని కుమ్మరి సారె అని కూడా అంటారు.
కొంత వేగంగా తిప్పి వదిలి వేసిన కుమ్మరి చక్రము,ఆ తర్వాత తనంత తానుగా కొంత సేపు తిరిగి ఆగిపోతుంది.అలాగే  మనిషి జీవిత చక్రం గిరగిరా  వృద్ధాప్యం వరకు వేగంగా తిరుగుతుంది.ఆ తర్వాత కొంత నిదానంగా తిరుగుతూ ఆగిపోతుంది అనే అర్థంతో ఈ"కులాల చక్ర న్యాయము"ను మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
 కుమ్మరి చక్రం అంటే తెలియని వారుండరు. చక్రమే మానవ జీవన గతిని మార్చేసింది. పురాతన ప్రపంచంలో కుమ్మరి చక్రం ఆవిష్కరణ ఓ అద్భుతం.మానవ జీవన గమనాన్ని నిర్దేశించిన అపురూప చక్రం. చక్రం కనిపెట్టిన తరువాతే మానవ నాగరికతలో అనూహ్యమైన మార్పు వచ్చింది. వ్యవసాయం దగ్గర నుంచి అంతరిక్షంలోకి ప్రయాణించేందుకు దిశానిర్దేశమై నిలిచింది ఈ చక్రమే.
 జీవిత చక్రం ఊయల నుండి మొదలై సమాధి వరకూ తిరిగే చక్రం. మానవ జీవిత చక్రం జీవితంలో వివిధ దశలను దాటుకుంటూ తిరుగుతూ ఉంటుంది.ఇది అందరికీ తెలిసిన అక్షర సత్యం.
 భూమి ఓ  భూచక్రం. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. శ్రీమహావిష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుంది.ఇలా అభివృద్ధికీ, అన్యాయాన్ని అంతమొందించేందుకు ఉపయోగపడింది ఈ చక్రమే.
మానవ జీవిత చక్రాన్ని భగవంతుడు గిరాగిరా తిప్పి వదిలేస్తాడని,అది ఎంత వరకు తిరుగుతుందో అంత వరకు తిరిగి ఆగిపోతుందని మన పెద్దలు అంటుంటారు. ఆ తిరగడమంతా ఒకే విధంగా కాకుండా వివిధ దశలు,స్థాయిలు వుంటాయి.
 మనిషి జీవితమే ఒక చక్రం లాంటిది అనుకుంటే యోగ సాధకులు ఆ చక్రం సాఫీగా నడవాలంటే  లోపల  మరో ప్రధాన ఏడు చక్రాలు సరిగా వుండాలనీ,అవే మనిషి యొక్క శారీరక,మానసిక సామాజిక శ్రేయస్సును నిర్దేశిస్తాయి అంటారు.ఇలా చక్రాల సహాయంతో బతుకు బండి సవ్యంగా సాగిపోతుంది.అయితే ప్రతి చక్రం ఓ శక్తికి కేంద్ర బిందువు. ఇవి వెన్నెముక వెంబడి తల నుండి మూలం వరకు క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. ఈ చక్రాల్లో ఏ ఒక్కటి సరిగా పనిచేయక పోయినా, మొరాయించినా,గతి తప్పినా జీవిత చక్రానికే ముప్పు వాటిల్లుతుందని చెబుతుంటారు.
 మరి పనిలోపనిగా ఆ చక్రాల పేర్లను రేఖామాత్రంగా  తెలుసుకుందాం. ఒకటి ( 1) మూల చక్రము.(2) స్వాధిష్ఠాన చక్రము.(3).మణిపూర చక్రము.(4).అనాహత చక్రము.(5). విశుద్ధ చక్రము.(6).ఆజ్ఞా చక్రము.(7). సహస్ర చక్రము.
ఈ చక్రాలతో ముడిపడిన జీవిత చక్రము ఎప్పుడూ ఒకేలా సజావుగా నడుస్తుందా? అంటే నడవదనే సమాధానం వస్తుంది.
 జీవితం మలిదశలో శరీరంలోని అవయవాల పటుత్వం తగ్గిపోతుంది. యంత్రానికి రిపేర్లు వచ్చినట్లు జీవితానికి రిపేర్లు వస్తాయి. ఒక్క సారి తిప్పి వదిలిన చక్రంలా కొంత మేరకు తిరిగి ఆగిపోతుంది.ఇక కదిలించినా కదలదు.అంటే మరణం అన్నమాట.
 దానినే మన పెద్దలు ఈ "కులాల చక్ర న్యాయము"తో పోల్చి చెప్పారు.
అదండీ సంగతి! మన జీవిత చక్రంలో భాగమైన మిగిలిన ఏడు చక్రాలు సజావుగా సాగేందుకు వీలుగా, వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆగిపోయే చివరి క్షణం వరకూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు